Balendra Shah : నేపాల్‌ ప్రధాని రేసులో బలేంద్ర.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే...

జెన్‌-జెడ్‌ ఉద్యమం నేపాల్‌ను అట్టుడికిస్తున్నది.  ఈ నేపథ్యంలో నేపాల్‌కు కొత్త ప్రధాని ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ పదవికి పోటీ పడుతున్న నేతల్లో ఖాట్మండ్‌ మేయర్‌ బలేంద్ర షా కూడా ఒకరు. నేపాల్‌ యువతకు నాయకత్వం వహించే సత్తా ఉన్న వారిలో బలేంద్ర ఒకరు.

New Update
Balendra shah

Balendra shah

జెన్‌-జెడ్‌ ఉద్యమం నేపాల్‌(Nepal Youth Protest) ను అట్టుడికిస్తున్నది.  సోషల్ మీడియా(Social Media Ban) పై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడంతో మొదలైన ఉద్యమం ఆ దేశ నాయకత్వాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.జెన్‌-జెడ్‌  యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై బ్యాన్ మాత్రమే కాకుండా, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, రాజకీయ నేతల పిల్లల విలాసాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది. అల్లర్లు తీవ్రం కావడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ(kp-sharma-oli) రాజీనామా చేశారు. ఆ తర్వాత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్(Nepal President Ramachandra Paudel) కూడా రాజీనామా చేశారు. మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు కూడా తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో నేపాల్‌కు కొత్త ప్రధాని ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.  ఆ పదవికి పోటీ పడుతున్న ఒకరిద్దరు నేతల్లో ఖాట్మండ్‌ మేయర్‌ బలేంద్ర షా(Balendra Shah) కూడా ఒకరు. నేపాల్‌ యువతకు నాయకత్వం వహించే సత్తా ఉన్న వారిలో బలేంద్రకు మరో బలం ఆయన విద్యార్హతలు. ఆయన సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నది బెంగళూరులోని నిట్టే మీనాక్షి సాంకేతిక విద్యా సంస్థలోనే. 
ఇప్పుడు అందరి కళ్లు  రాజకీయ నాయకుడు, నేపాల్ మేయర్ బలేంద్ర షాపై ఉన్నాయి. బలేంద్ర షానే నేపాల్‌కు కాబోయే ప్రధాని అని ప్రచారం సాగుతోంది. యువతలో మంచి గుర్తింపు ఉన్న ఈయన, తాజా ఉద్యమానికి మద్దతు పలకడం గమనార్హం. సోమవారం సాయంత్రం, నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయడంతో, బలేంద్ర తన పేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రదర్శనకారులకు సంఘీభావం ప్రకటించారు.

Also Read :  ఘోర ప్రమాదం.. గ్యాస్‌ ట్యాంకర్ లీకై భారీ పేలుడు, ముగ్గురు మృతి

Balendra Shah In The Race For Nepal's PM

‘‘ఉద్యమ నిర్వాహకులు 28 ఏళ్ల లోపు వ్యక్తులు పాల్గొనాలని చెప్పడంతో తాను హాజరుకాలేకపోయానని, వారి గళం వినడం అవసరం’’ అని ఆయన తన పోస్ట్‌లో అభిప్రాయపడ్డారు. ‘‘నేను వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, చట్టసభ సభ్యులు, ప్రచారకులు ఈ ర్యాలీని వారి స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించొద్దు’’ అని అన్నారు. నేపాల్‌లోని యువత కూడా బలేంద్ర షా తదుపరి తమ ప్రధాని అని సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. నేపాల్ ప్రజలు ఆయన వెంటే ఉంటారని చెబుతున్నారు.

సోమవారం, ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత బలేంద్ర షా వార్తల్లో వ్యక్తిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. బలేంద్ర షాను బలెన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఆయన ఖాట్మాండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్‌గా ఉన్నారు. 1990లో ఖాట్మాండులో జన్మించిన ఆయన నేపాల్ లో సివిల్ ఇంజనీరింగ్ అభ్యసించారు.  ఆ తర్వాత భారత్‌ దౌత్య కార్యాలయం సహకారంతో నేపాల్‌ నుంచి కర్ణాటకకు వచ్చిన బలేంద్ర బెళగావిలోని విశ్వేశ్వర సాంకేతిక విశ్వవిద్యాలయంలో బీఈలో చేరారు. అనంతరం బెంగళూరులోని నిట్టే మీనాక్షి సంస్థలో చేరి 2016-18 వరకు ఎంటెక్‌ను పూర్తి చేశారు. 

చదువుకుంటున్న సమయంలోనే సంగీతంపై ఉన్న పట్టుతో ర్యాంపర్‌గా, సామాజిక మాధ్యమాల్లో అత్యంత చురుకుగా కనిపించేవాడు బలేంద్ర షా. ఎంటెక్‌ తర్వాత నేపాల్‌ ప్రభుత్వం చేపట్టిన భారీ సొరంగ మార్గం నిర్మాణ ప్రాజెక్టులో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఆపై రాజకీయాల వైపు దృష్టి సారించిన బలేంద్ర 2022లో ఖాట్మాండ్‌ మేయర్‌ ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్థిగా గెలిచి ప్రధాన పార్టీలకు షాక్‌ ఇచ్చారు.  సోషల్‌ మీడియా ద్వారా సంపాదించిన ఫాలోవర్స్‌ మద్దతుతోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బలేంద్ర చదువుతున్న సమయంలో ఎన్నడూ రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదని ఆయనకు చదువు చెప్పిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రేయాస్‌ చెప్పారు. చదువులోనూ 9-సీజీపీఏతో డిగ్రీ అందుకున్న బలేంద్ర షా తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా నేపాల్‌లోని పేదరికాన్ని, యువత ఉపాధిని సంగీతం ద్వారా ప్రచారం చేసి రాజకీయాల్లో రాణించటం గమనార్హం.

రాజకీయాల్లో చేరక ముందు హిప్ హాప్ రాపర్‌గా, గీత రచయితగా అందరికి సుపరిచితం. తన సంగీతం ద్వారా తరుచుగా అవినీతి, అసమానతలు వంటి సమస్యల్ని లేవనెత్తేవారు. 2022లో ఖాట్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 61,000 ఓట్లతో గెలిచారు. ఇతను సబీనా కాఫ్ల్‌ని వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. పౌర సమస్యలు, రాజకీయ చర్చల ద్వారా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటారు.

Also Read :  కలకలం రేపుతున్న చార్లీ హత్య.. భారతీయులకు వీసాలు ఇవ్వద్దంటూ విద్వేషం

Advertisment
తాజా కథనాలు