రాజధాని అమరావతి కోసం భూసేకరణ పై చంద్రబాబు ప్రభుత్వ తీరును కాగ్ ఎండగట్టింది. అలాగే జగన్ ప్రభుత్వానికి కూడా చురకలు అంటించింది. రాజధాని కోసం భూసేకరణ లో నిపుణుల కమిటీ సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొలేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన మొత్తం భూమిలో 70 శాతం భూ సమీకరణ ద్వారా సేకరించాలనే నిర్ణయం వల్ల భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల వల్ల నిధులు నిరుపయోగం పై ప్రస్తుత జగన్ ప్రభుత్వ తీరును కూడా కాగ్ తప్పుబట్టింది. 2019 మే నుంచి వివిధ పనులను నిలిపి వేశారని కాగ్ తెలిపింది. దీని వల్ల ఈ పనుల కోసం ఖర్చు చేసిన 1,505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కన్సల్టెంట్ లను సరైన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్దతిలో ఎంపికచేయడాన్ని కాగ్ నివేదికలో తప్పుబట్టింది. స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీసిఆర్డిఏ , పీడీసిఎల్ లు 33,476.23 కోట్లతో కౌళిక సదుపాయల ప్యాకేజి ల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని కాగ్ తెలిపింది. 2016-23 కాలానికి 55,343 కోట్ల రూపాయలు అవసరం కాగా ఏపీ సిఆర్డిఏ అన్ని వనరుల నుంచి 11,487.16 కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించాయని తెలిపింది. 2019 ఫిబ్రవరి తరువాత రూపొందించిన ఆర్థిక ప్రణాళిక ప్రకారం బడ్జట్ తోడ్పాటును ఇవ్వలేదని తెలిపింది. కనీసం ఇచ్చే ప్రయాత్నాలు కూడా చేయలేదని స్ఫష్టం చేసింది.
కాగ్ తన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపైనా పలు ఆరోపణలు చేసింది. రాజధాని అమరావతి వ్యవహారంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల రెండు ప్రభుత్వాల పద్ధతినీ తప్పుబట్టింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని తెలిపింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రాజధాని అమరావతి లో నిర్మాణాలను పూర్తి చేయకుండా వదలివేయడంతో నిధుల వృధా జరిగిందని స్పష్టం చేసింది. కాగ్ తన నివేదికలో ఏలూరు రాష్ట్రంలో జరిగిన నిధుల వృధాపై పలు అంశాలు స్పష్టం చేసింది. రాజధాని అమరావతి వ్యవహారంలో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల తీరు దొందు దొందే అన్నట్లుందని పలు ఆరోపణలు చేసింది. వీటితో పాటు ఏలూరు నగరపాలన సంస్థలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటులో నిష్ఫలమైన వ్యయం 1.58 కోట్లు గా చూపింది. సేవాపన్నుల జమ, ఉద్యోగుల భవిష్యనిధి, ఉద్యోగుల రాష్ట్ర భీమా వాటలు, విద్యుత్ వినియోగ ఛార్జీలు వంటి చట్టబద్దమైన , తప్పనిసరి బకాయీలను సంబంధిత అధికార సంస్థలకు సకాలంలో చెల్లింపులకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలు వివిధ చట్టాల నిబంధనలు పాటించలేదని తెలిపింది. చెల్లింపుల్లో జాప్యం కారణంగా సదరు సంస్థలు విధించిన 14. 70 కోట్ల అపరాధ రుసుము చెల్లించాల్సి వచ్చిందని తెలిపింది.
విశాఖపట్నం జిల్లాలో 2017 - 18లో 16 పర్యావరణ పథకాలకు 4.30 కోట్లు కేటాయించగా... 2019-20లో అది 0.33 కోట్లకు తగ్గిందని వివరించింది. బోర్డులో శాస్త్రీయ సాంకేతిక సిబ్బంది కొరత తీవ్రంగా వుండటం వలన పరిశ్రమలు, యూనిట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిన తనిఖీలు చేయలేకపోయరని తెలిపింది. బోర్డు 2019-20 సంవత్సరానికి 1,353 తనిఖీలు చేయాల్సి వుండగా కేవలం 243 తనిఖీలు మాత్రమే చేశారని తెలిపింది. విశాఖపట్నంలో 876 పరిశ్రమల్లో 70 పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండా నడుస్తున్నాయని పరిశ్రమల శాఖలో డొల్లతనాన్ని తేల్చి చెప్పింది. జీవీఎంసీ లో ఇళ్ల నుండి ఘన వ్యర్థాల సేకరణ చేయాల్సిన సేవాస్థాయి వంద శాతం వుండగా కేవలం 42 శాతం మాత్రమే సేకరించిందని తెలిపింది. 2015-20 మధ్య కాలంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో 129కోట్ల తగ్గుదల వుందని తెలిపింది. 2016-18 మధ్య కాలంలో పని తీరు గ్రాంటులో 28.93 కోట్లకు కోత పడిందని తెలిపింది. తాడిపత్రి, శ్రీకాళహస్తి, పుంగనూరు, అద్దంకి మున్సిపాలిటీలను వాటి అర్హతకు తగినట్లు పెంచలేదు అని కాగ్ తెలిపింది. నీటి సరఫర నిమిత్తం ప్రత్యేకించి పైపులైన్ లను వేయకపోవడం వల్ల నీటిని తక్కువగా పొందడమే కాక నీటి ఛార్జీలపై ఆంధ్ర విశ్వ విధ్యాలయం మూడు కోట్ల రూపాయలు నిరర్ధకంగా చెల్సించింది. ఔషధాలు, డ్రస్సింగ్ మెటీరియల్ ఆలస్యంగా సరఫర చేసినందుకు రేటు కాంట్రాక్ట్ లో వున్న నిబంధనలను ఏపీ వైధ్య సేవల భీమా అమలుపరచకపోవడం వల్ల ఔషధ సంస్థలకు 2.59 కోట్ల మేర అనుచిత లబ్ది చేకూరిందని కాగ్ గుర్తిచింది. అమరావతిలో 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు సభా ప్రాంగణం, స్మారక సభా వేదిక, ధ్యాన మందిరం స్మృతివనం నిర్మాణం నిలిచిపోడం వల్ల 44.61 కోట్లు వృధా అయ్యిందని కాగ్ స్పష్టం చేసింది.