తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కుతోంది. గెలుపు కోసం ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. అధికార బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ (BJP) గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని బీజేపీ శ్రేణులు ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులు ఆందోళన చేస్తారని ముందే గ్రహించిన పోలీసులు ఆ పార్టీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేశారు. అయినప్పటికి బీజేపీ శ్రేణులు పోలీసులు కళ్లు గప్పి మంత్రి గంగుల ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి గేటు దూకి లోపలకి వెళ్లారు. బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని.. గత హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు
తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా బీజేపీ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తుండగా.. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు ఆఫీసును ముట్టడించగా.. బీఆర్‌ఎస్ (BRS) శ్రేణులు ఆందోళన కారులపై దాడికి యత్నించారు. బీజేపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగడంతో ఇరు పక్షాల కార్యకర్తలు గాయపడ్డారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ బీజేపీ నేతల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ నిరసనలను తిప్పికొట్టేందుకు అధికార బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధికి సహకరించడం పోయి.. డెవలప్‌మెంట్‌ను అడ్డుకుంటోందంటూ ఆరోపిస్తోంది. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తమను ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదంటున్నారు బీఆర్‌ఎస్ నాయకులు.
కిషన్ రెడ్డి పిలుపుతో
ఎన్నికల వేళ.. బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ (Congress) మోసపు మాటలను నమ్మితే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తోడు దొంగలని, ఒకరు రాష్ట్రంలో, మరొకరు కేంద్రంలో అధికారంలో ఉండి.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ కాంగ్రెస్ మరోవైపు విమర్శిస్తోంది. మొత్తానికి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ రాష్ట్రంలో ఎన్నికల వేడిని పుట్టిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం చూడండి..