/rtv/media/media_files/2025/08/16/businessman-kidnaps-daughter-2025-08-16-13-17-51.jpg)
Businessman kidnaps daughter
స్వాతంత్ర దినోత్సవం రోజు(Independence Day) నే ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేసిన అప్పు తీర్చలేదని ఓ వ్యాపారి అతని కూతుర్ని కిడ్నాప్ చేశాడు. స్కూల్లో పంద్రాగస్టు వేడుకలకు హాజరై ఇంటికి వస్తుండగా వ్యాపారి ఈ కిడ్నాప్ చేశాడు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెండు గంటల్లోనే కేసును ఛేదించారు. బాలికను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఒంగోలు(ongole) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ దామోదర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వావారిపాలేనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులు చేసేందుకు తిరుపతికి వెళ్లాడు. ఆ సమయంలో తిరుపతికి చెందిన ఆర్.ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.5లక్షలు అప్పుతీసుకున్నాడు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా(prakasam district) కు తిరిగి వచ్చిన శ్రీనివాసరావు ఈ శ్వరరావుకు ఆ బాకీ చెల్లించ లేదు(Repay Debt). ఈశ్వర రెడ్డి అనేకసార్లు అడిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో కిడ్నాప్ ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో చీమకుర్తి గ్రామానికి వచ్చిన ఈశ్వర్‌రెడ్డి డైరెక్ట్‌గా శ్రీనివాసరావు కూతురు చదువుకునే స్కూల్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు హాజరై బయటకు వస్తున్న శ్రీనివాసరావు కూతురును గుర్తించి ‘మీ నాన్న ఇంటికి తీసుకురమన్నాడంటూ మాయమాటలు చెప్పి మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒంగోలుకు వైపు తీసుకెళ్తూ స్వీట్లు కొనిస్తానని నమ్మించాడు. ఈ దృశ్యం స్కూల్‌వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఒంగోలుకు వెళ్లిన తర్వాత శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి ‘మీ కుమార్తెను తీసుకెళుతున్నా.. నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తా’ అని బెదిరించాడు.
Businessman Kidnaps Daughter
ఒంగోలు వెళ్లిన తర్వాత వాహనాన్ని నెల్లూరు వైపు మళ్లించాడు. దీంతో అనుమానించిన మేఘన తండ్రితో మాట్లాడాలని ఏడవసాగింది. తండ్రి ఫోన్ నంబర్ చెప్పటంతో శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి బకాయి డబ్బులు ఇవ్వనందున మీ కుమార్తెను కిడ్నాప్ చేస్తున్నాననీ ఫోన్ పెట్టేశాడు. వెంటనే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చీమకుర్తి పోలీసులను సంప్రదించారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఆర్.ఈశ్వరరెడ్డిగా గుర్తించారు. కిడ్నాపర్ ఈశ్వర్ రెడ్డి సెల్‌నంబర్, అతని వాహనం నంబర్ ఆధారంగా అతను నెల్లూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. చీమకుర్తి నుంచి ఒక టీమ్ నెల్లూరువైపు వెళ్లింది. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకున్నారు. ఇదే సమయంలో తాను అపహరణకు గురయ్యాననే విషయాన్ని బాలిక సంజ్ఞల ద్వారా రహదారిపై వెళ్తున్న ప్రయాణికులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి మండలం బిట్రగుంట సమీపంలో అడ్డా వేసిన పోలీసులు నిందితుడి వాహనాన్ని ఆపేసి బాలికను సంరక్షించారు.
ఆ తర్వాత ఆ వెనుకనే వస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులకు పాపను అప్పగించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. పోలీసుల అప్రమత్తతతో పాటు బాలిక ధైర్యం, సమయస్ఫూర్తి ఆమెను రక్షించాయని అన్నారు. బాలికను కేవలం రెండు గంటలలోపే రక్షించటంలో కృషిచేసిన చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఎస్సై కృష్ణయ్య, సిబ్బందిని ఎస్పీ దామోదర్ అభినందించారు.