/rtv/media/media_files/2024/12/08/qi8J6TpOq2YxBi0Z5wla.jpg)
Minister Ponguleti srinivasareddy
TG News: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు మేలు చేకూరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లపై అంబేద్కర్ సచివాలయంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా లబ్దిదారుల ఎంపిక నుండి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేవరకూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్- (AI)ని వాడుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రత్యేక యాప్‌ను రూపొందించి సర్వే..
ఈ మేరకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్‌ను రూపొందించి సర్వే నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇండ్ల నిర్మాణం, చెల్లింపులలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడినుంచైనా రోజువారీగా ఇండ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిజమైన నిరుపేదలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలను క్లౌడ్ ఆధారిత కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీతో సరిపోలుస్తూ అనర్హులను గుర్తించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో చెల్లింపులు చేస్తామని, ఈ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా ఏఐ టెక్నాలజి ని వాడుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TG Farmers: రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!
రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా, ఇతర ప్రభావిత విభాగాల జోక్యం లేకుండా లబ్దిదారుల ఎంపిక జరిగేలా ఈ విధానాలు సహకరిస్తాయని, అనర్హులు ఎవరైనా ఉంటే పూర్తిగా గుర్తించే అవకాశాలు ఈ నూతన సాంకేతిక విధానం వలన సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన 4 ప్రతిష్టాత్మక పథకాలలో ఇందిరమ్మ ఇండ్ల పధకం ఒకటని చెప్పారు. దీనిలో తొలి విడతగా నివాస స్థలం కలిగిన 72 వేల మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేదలు, వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యత ఇస్తునట్లు తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Narendra Modi : బీజేపీ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. వీడియో వైరల్