Telangana Politics: తెలంగాణ సాయుధ పోరాటం.. విమోచనమా? విలీనమా? విద్రోహమా?

తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. అయితే నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారే తమకు అనుకూలంగా అనేక వక్రీకరణలను ప్రచారం చేస్తున్నాయి. తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఆయా పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి.

New Update
Telangana Liberation Day 2025:

Telangana Liberation Day 2025

తెలంగాణ(Telangana) సాయుధ పోరాటం.. నిజాం నిరాంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన మహోజ్వల ప్రజా పోరాటం. అయితే నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారే తమకు అనుకూలంగా అనేక వక్రీకరణలను ప్రచారం చేస్తున్నాయనే వాదన ఉంది. తమకున్న రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఆయా పార్టీలు చరిత్రను వక్రీకరించి ప్రచారం చేసుకుంటున్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం ఒక మతానికో, కులానికో వ్యతిరేకంగా సాగింది కాదు. తెలంగాణ ప్రజా పోరాటం మొదటి నుండి నిజాంకు, రజాకార్లకు , అంతకంటే ముఖ్యంగా తెలంగాణను చెరబట్టిన దొరల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా కొనసాగింది.

సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజు మాత్రమే కాదు, ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిన రోజు. 1948 సెప్టెంబర్ 17ను తెలంగాణకు విమోచన దినోత్సవం అని, భారత్‌లో విలీనమైన రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజు అని చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. చరిత్రలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి, ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల పాత్రను కనుమరుచేసే కుట్రలు జరుగుతున్నాయి. వాస్తవ చరిత్రను వక్రీకరించి, వక్రభాష్యాలు చెప్పి నేటి తరం తెలంగాణ ప్రజల మనసులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక దినాన్ని తమ పార్టీ త్యాగాల ఖాతాలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.   

1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ 11వ మహాసభ నాటికి.. అందులోని ప్రధాన నాయకులందరూ సామ్యవాద ఆదర్శాలతో ప్రభా వితులై.. కమ్యూనిస్టులుగా మారారు. అప్పటి నుండి తెలంగాణ ప్రజాపోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. బాంచన్‌ కాల్మొక్తా అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు.. బరిసెలు, బందూకులూ చేతబట్టి.. దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించిన వీరోచిత చరిత్ర అది. నిఖార్సైన శ్రామికవర్గ ఎజెండాతో సాగిన ఆ పోరాటంలో.. మూడువేల గ్రామాలు విముక్తమై గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది. దొరల కబ్జాలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంచబడింది. రుణ పత్రాలు రద్దయ్యాయి. వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగాయి. కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి చేయబడినాయి.  తెలంగాణ గడ్డపై సాగిన ఆ ప్రజా పోరాటాన్ని.. ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన ఒక మతపరమైన పోరాటంగా  కొంతమంది చిత్రీకరించడం వారి విజ్ఞతకే వదిలేద్దాం. సాయుధ పోరాటం అంతా భూమి సమస్య, కూలీ సమస్య, శ్రమ దోపిడి సమస్యలపై పోరాటం జరుగుతుంది తప్ప, వేరే అంశాల ప్రస్తావనే లేదు.  అయితే తమపైన జులుం చేయడానికి నిజాం ప్రభువుకైనా, దొరలకైనా మతం అడ్డు రాలేదన్న సత్యాన్ని తెలంగాణాలోని ఇరు మతాల ప్రజలందరూ స్పష్టంగా అర్థం చేసుకున్నారు.  అందుకే గ్రామాల్లో దొరలు, ఆ దొరలకు వెన్నుకాస్తున్న పాలకుడైన నిజాంకు వ్యతిరేకంగా పోరు నడిచింది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ రాజ్యం దేశంలో విలీనం చేయడానికి జరిగిన ప్రయత్నంతోనే అసలు సమస్య వచ్చి పడింది. అందుకే ఏ పార్టీ ప్రభుత్వాలు దీనికి సరైన సమాదానం చెప్పలేక ఎవేవో పేర్లతో జెండా ఎగరేసి జేజేలు కొట్టుకుంటున్నారు.

Also Read :  పాత ఫొటోలను బయటపెట్టిన కవిత.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!

విలీనమూ లేదు.. విమోచనా జరగలేదు!

1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైనట్లు కనిపించినా, అది అసంపూర్ణమే. నిజాం ప్రభువుకు తగిన గౌరవమే దక్కింది. ఆయనకు ఎలాంటి శిక్షా విధించలేదు. ఆయన అరాచకాలు కూడా కొనసాగాయి. విమోచనం జరిగింది, అనుకుంటే నిజాం ఇక్కడి నుండి పారిపోవాలి లేదంటే అతని అధికారాలు, ఆస్తులు జప్తు చేయబడాలి. చేసిన దుర్మార్గాలకు గాను శిక్ష అనుభవించాలి. కానీ అలాంటివేమి జరగలేదు. భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య యథాస్థితి కొనసాగించే ఒప్పందం మాత్రమే కుదిరింది. సర్ఫేఖాస్ భూములు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఏడవ నిజాం నవాబు ప్రజలను పీడించి కూడబెట్టిన బంగారం, నగలు, వజ్రాలు ఇతర దేశాలకు స్వేచ్ఛగా తరలించబడ్డాయి. అంతేకాదు 1850 జనవరి నుండి 1956 అక్టోబర్ వరకు రాజ్‌ ప్రముఖ్‌గా రాజభవన్‌లోనే ఉండి అధికారం చలాయించారు. ఆపరేషన్ పోలో తర్వాత1971 వరకూ సంవత్సరానికి 50 లక్షలు రాజభరణంగా నిజాంకు చెల్లించారు. వీటికి పన్ను మినహాయింపు ఇచ్చారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీనిని రద్దు చేసింది.గ్రామాలలో 1948 నాటికి ప్రజల తిరుగుబాటు పెరిగి, కమ్యూనిస్టు పార్టీ బలపడడం భారత ప్రభుత్వం గమనించింది. దీనికి తోడు దున్నే వాడిదే భూమి ప్రాతిపదికగా 10 లక్షల ఎకరాలు ప్రజల స్వాధీనం అయ్యింది. 3000 గ్రామాలలో గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడ్డాయి. దీనిని ప్రమాదంగా భావించిన భారత ప్రభుత్వం (కాంగ్రెస్ పాలకులు) నిజాంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుమించి విలీనం జరగలేదు. విమోచన అంతకంటే జరగలేదు. అందుకే 1948 సెప్టెంబర్ 17లో జరిగింది ముమ్మాటికి ప్రజా విద్రోహమే అన్నది కొందరి వాదన.

Telangana Liberation Day 2025:

బీఆర్‌ఎస్‌ జాతీయ సమైక్యతా దినం

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఆవిర్భవించిన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌(brs) ప్రభుత్వం 17 సెప్టెంబర్‌ ను తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించారు.   

Revanth-Reddy

కాంగ్రెస్‌ ప్రజాపాలన దినోత్సవం

నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొంది, అఖండ భారత్‌లో విలీనమైన సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’గా నిర్వహించాలని అధికార కాంగ్రెస్‌(congress) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ ఉత్సవాన్ని రాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మిగిలిన 32 జిల్లాల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్‌ చైర్మన్లకు డిజిగ్నేట్‌ చేసింది. తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana Liberation Day 2025:

కమ్యూనిస్టులు  విలీనం దినోత్సవం : సెప్టెంబర్ 17’ను   తెలంగాణ సాయుధ పోరాట దినంగా, విలీన దినోత్సవంగా కమ్యూనిస్టులు భావిస్తున్నారు. 

Also Read :  గ్రూప్-1పై TGPSC సంచలన నిర్ణయం.. డివిజన్ బెంచ్ లో పిటిషన్!

బీజేపీ విమోచన దినోత్సవం

ఇక సెప్టెంబర్ 17 కచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ(bjp) వేడుకలు నిర్వహిస్తుంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ.. మరోసారి ఘనంగా నిర్వహించింది. కేంద్రం మంత్రుల ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో ఈ సారి కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించింది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.గ్రామ గ్రామాన సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగురవేయించి, విమోచన దినోత్సవ చరిత్రను తెలిపే వర్చువల్ మ్యూజియంను ప్రజలకు చూపించాలని కేడర్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.  

గంగా జమునా సంస్కృతి

ఇవన్నీ ఎలా ఉన్నా   తెలంగాణలో గత ప్రభుత్వాలు తీసుకున్న  చర్యల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో మతతత్వ ఘర్షణలు తగ్గుముఖ్యం పట్టాయి. ఈ వాస్తవానంతర కాలంలో అటువంటి బాధాకరమైన జ్ఞాపకాలనే రాజేయ్యటం వల్లన ఘర్షణలు కొత్తగా మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్నికలలో మతతత్వ కార్డుని వాడుకునే రాజకీయ శక్తులకు ఈ గొడవలు ఉపయోగపడతాయి అనేది తెలిసిన విషయమే. ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ఎత్తి చూపుతూ, బాధాకరమైన జ్ఞాపకాలను పాతిపెట్టవలసిన బాధ్యత నేడు లౌకిక, పౌర, సామాజిక శక్తులపై ఉన్నది.'గంగా జమునా సంస్కృతి'కి ఒకప్పుడు పేరుగాంచిన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింతగా నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేడు ఆ విలువ మాత్రమే సామాజిక సామరస్యాన్ని నిలబెట్టి, ఈ రాష్ట్ర శాంతియుత అభివృద్దికి దోహదం చెయ్యగలదు. కనుక ఏ పేరుతో జరుపుకున్నా అందరకీ ఆమోదయోగ్యమైన నాడే దానికి గుర్తింపు అన్న విషయాన్ని మనం అంగీకరించాలి.

Advertisment
తాజా కథనాలు