/rtv/media/media_files/2025/10/27/srisailam-hydropower-station-2025-10-27-08-28-33.jpg)
Srisailam Hydropower Station
Srisailam : శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో మరోసారి సమస్య తలెత్తింది.150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్ మళ్లీ పాడైంది. ఇదివరకే పాడవ్వగా మరమ్మతులు చేశారు. విద్యుదుత్పత్తి ప్రారంభించిన 10 గంటల్లోనే మళ్లీ ట్రిప్‌కావడంతో పూర్తిగా నిలిచిపోయింది. నాలుగో యూనిట్ ఇలా పూర్తిగా పాడవడం రెండోసారి కావడం గమనార్హం. ఈ కేంద్రంలో మొత్తం ఆరు విద్యుత్ యూనిట్లు ఉండగా ఒక్కోదాని స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లు. 2020 ఆగస్టు 20న అగ్ని ప్రమాదం సంభవించి 4వ యూనిట్ పూర్తిగా కాలిపోయింది. 2021 సెప్టెంబరులో రూ.68 కోట్లతో మరమ్మతు చేపట్టగా 2022 ఆగస్టులో పనులు పూర్తయ్యాయి. 2023 ఆగస్టు 15 నుంచి తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. మరమ్మతు తర్వాత కేవలం 80 గంటలు మాత్రమే పనిచేసింది. అంతలోనే వైండింగ్ కాలిపోయి తొలిసారి పాడైంది. తిరిగి మరమ్మతులు చేపట్టడంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆలస్యం చేసింది. రెండేళ్ల తర్వాత ఈ నెల 2న పనులు పూర్తి చేసింది. కానీ అదే రోజు రాత్రి ఉత్పత్తి ప్రారంభించిన 10 గంటల్లోనే మళ్లీ పాడవడంతో మళ్లీ మొదటికి వచ్చింది.
Also Read : నేడు మద్యం దుకాణాలకు లక్కీడ్రా..నగరంలోనే అధికం
Srisailam Hydropower Station
2020 ఆగస్టులో తొలిసారి అగ్ని ప్రమాదం(fire accident) మూలంగా పాడవ్వగా నాటి నుంచి నాలుగో యూనిట్‌లో ఐదేళ్లకాలంలో రోజుకు 30 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో జెన్‌కోకు రూ.వెయ్యి కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. డిమాండ్ పెరిగిన సమయంలో ఒక్కో రోజు రూ.5 నుంచి రూ.10 వరకు గరిష్ఠ ధరకు ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’(ఐఈఎక్స్)లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్‌ను కొంటున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో కేవలం రూ.2కే ఒక యూనిట్ ఉత్పత్తవుతుంది. అయినా ఐదేళ్లుగా యూనిట్‌ను సక్రమంగా నడిపించకపోవడం... మార్కెట్‌లో అధిక ధరలకు కరెంటు కొనాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికంగా ఎక్కువ భారం పడుతుంది.
2020లో శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రూ.వెయ్యి కోట్ల విద్యుదుత్పత్తి నష్టం వాటిల్లింది. అయినా ఒక్క ఉద్యోగిపైనా జెన్‌కో చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. చివరికి కాలిన 4వ యూనిట్ మరమ్మతు విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో స్టేటర్, రొటవేటర్ మరమ్మతు పనుల టెండర్లను రూ.14.90 కోట్లతో రెండు వేర్వేరు కంపెనీలకు అప్పగించారు. అయితే ఆరెండు కంపెనీల మధ్య సమన్వయం లేకపోవడంతో మరమ్మతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినవస్తు్న్నాయి. ఎట్టకేలకు 2022లో మరమ్మతులు పూర్తి చేసి... ఉత్పత్తిని తిరిగి ప్రారంభించినప్పటికీ వెంటనే స్టేటర్, రొటవేటర్‌ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఏర్పడి ఉత్పత్తి నిలిచిపోయింది.
అయితే ఈ విషయంలో పూర్తిగా అధ్యయనం చేయకుండానే... 2024 ఆగస్టులో తిరిగి ఒకే కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. మొదట రెండు కంపెనీలకు టెండర్లు ఇచ్చి మరమ్మతులు చేయగా రెండోసారి ఒకే కంపెనీకి ఇవ్వడం, తొలిసారి ఇచ్చిన కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలకు అధికారుల వద్ధ సమాధానం లేదు. విద్యుత్కేంద్రంలో పాడైన ఒక యూనిట్ మరమ్మతులు చేయడానికే ఐదేళ్లు పడుతుంటే కొత్త విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం అంతా ఈజీ కాదన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మరమ్మతులు చేసిన ప్రైవేటు సంస్థపై జెన్‌కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సదరు సంస్థ ఈ నెల 29న నిపుణులతో అధ్యయనం చేయించి చెబుతామని చెప్పింది. దీంతో ఈ యూనిట్‌లో వచ్చే ఏడాది వానాకాలంలో వచ్చే వరదలు నాటికి విద్యుదుత్పత్తి చేయడం కష్టమేనని.. దీంతో రోజుకు రూ.60 లక్షల నష్టం తప్పదని నిపుణులు అంటున్నారు. ఈ విషయాన్ని జెన్‌కో ఎలా పరిష్కరిస్తుందోననే సందేహాలు లేకపోలేదు.
Also Read : తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
Follow Us