Telangana Police :   తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం..ఇకపై ఇంటి నుంచే ఫిర్యాదులు

శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలతో అనుబంధం పెంచుకోవడానికి అనేక సంస్కరణలు తీసుకొస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సైబర్ బాధితులు ఇంటివద్ద నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తోంది. సీ-మిత్ర పేరుతో ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేసింది.

New Update
FotoJet - 2026-01-20T192016.916

Sensational decision by Telangana Police Department

Telangana Police : శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలతో అనుబంధం పెంచుకోవడం విషయంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ  మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బాధితుల ఇంటి వద్దేఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే చాలా కేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేక పోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యల్లో ఇరుక్కుంటామని చాలామంది భావించడంతో పాటు స్టేషన్‌కు వెళ్లాలంటే ఇబ్బంది పడడం కూడా కారణమే. దీన్ని నివారించడం కోసం బాధితులు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేలా  సీ-మిత్ర పేరుతో  ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేశారు హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులు.  

వర్చువల్ హెల్ప్‌ డెస్క్ 

 సాంకేతికత అందిపుచ్చుకోవడంలో నిపుణుల కంటే నేరగాళ్లే ముందుంటున్నారు. దీంతో ప్రజల సొమ్మును విచ్చలవిడిగా కాజేస్తున్నారు.  వీటిలో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఐడెంటిటీ థెప్ట్ వంటి అనేక కేసులు ఉన్నాయి. బాధితులు ఫిర్యాదు చేయకపోవడం వల్ల దుండగులను పట్టుకోవడం పోలీసులకూ కష్టంగా మారుతోంది. బాధితులు ఫిర్యాదు చేయలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి చాలా మంది వెనకాడుతుంటారు. అందుకే ఇకపై స్టేషన్‌కు వెళ్లుకండానే ఫిర్యాదు చేసేలా సీ-మిత్ర పేరుతో వర్చువల్ హెల్ప్‌ డెస్క్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దేశంలోనే తొలిసారి ఏర్పాటైన ఈ హెల్ప్ డెస్క్‌ 10 రోజుల్లోనే వెయ్యి మందికి ఫోన్‌ చేసి ఏఐ సాయంతో 200 మందికి ఫిర్యాదు డ్రాఫ్ట్‌లు సిద్ధం చేసింది. అంతేకాదు, నిమిషాల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్​​ FIR కాపీలను బాధితుల ఫోన్లకు చేరవేసింది.

బాధితులకు భరోసా

సైబర్ మోసాల బారిన పడినవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియ పూర్తి చేయడం సీ-మిత్ర ప్రత్యేకత.  సైబర్ మోసానికి గురయినప్పుడు మొదట 1930 నంబర్‌కు కాల్‌ చేయాలి. లేదా జాతీయ సైబర్ పోర్టల్ cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. తర్వాత ఎఫ్ఐఆర్​ నమోదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఐతే, ఇక్కడే అసలు సమస్య వస్తోంది. చాలామంది స్టేషన్‌కి వెళ్లలేక ఫిర్యాదు దగ్గరే ఆగిపోతున్నారు.1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు, జాతీయ సైబర్ పోర్టల్‌కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18% మాత్రమే ఎఫ్ఐఆర్​లుగా మారుతున్నాయి. దీంతో పోలీసు శాఖనే వారి ఇంటికి వచ్చేందుకు సిద్ధమైంది. సీ-మిత్ర ద్వారా దీనిని 100% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సైబర్ క్రైం పోలీసులు. బాధితులు స్టేషన్‌కు వెళ్లకుండా హెల్ప్ డెస్క్‌ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు ప్రక్రియ పూర్తి చేసేలా సేవలు అందించడానికి సిద్ధమైంది.

ఎఫ్ఐఆర్​ నమోదు 

సైబర్ మోసాల బారిన పడినవారికి సీ-మిత్ర సిబ్బందే స్వయంగా ఫోన్ చేస్తారు. బాధితుల వివరాలు సేకరిస్తారు. ఏఐ ద్వారా పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ సిద్ధం చేసి వాట్సాప్‌లో బాధితులకు పంపిస్తారు. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్ స్టేషన్, బషీర్‌బాగ్, హైదరాబాద్-500029 అనే అడ్రస్‌కు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపింతే చాలు. లేదా సైబర్ క్రైం పీఎస్​లో డ్రాప్ బాక్స్ ఉంటుంది. దాంట్లో ఫిర్యాదు కాపీ వేసిన సరిపోతుంది.వాటి ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేస్తారు. తద్వారా బాధితులకు వేగంగా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. కాగా ప్రస్తుతం  హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందిస్తున్న ఈ సేవలను త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
 

Advertisment
తాజా కథనాలు