Panchayat With Minister: తెలంగాణలో కొత్త లొల్లి.. మంత్రితో పంచాయితీ.. IAS రాజీనామా?

తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, సంబంధిత అధికారులకు అసలు పడటం లేదు. దీంతో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ( వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది.

New Update
Excise Department

Panchayat minister vs IAS

తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, సంబంధిత ఉన్నతాధికారులకు అసలు పడటం లేదని తెలుస్తోంది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో సీనియర్‌ ఐఏఎస్‌(ias) అధికారి, ఎక్సైజ్‌ శాఖ(excise-department) ముఖ్యకార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ  స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. మంత్రితో సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందని ప్రచారం సాగుతోంది.  ఇంకా ఎనిమిదేండ్ల సర్వీస్‌ ఉండగానే రిజ్వీ అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అనే అంశం చర్చనీయంశగా మారింది. 

అయితే మద్యం లేబుళ్ల తయారీ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది. హైసెక్యూరిటీ హాలోగ్రామ్స్‌, 2డీ బార్‌ కోడింగ్‌ లేబుల్స్‌ తయారీ టెండర్లకు సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య జరుగుతున్న వివాదంలో రిజ్వీని బలిపశువును చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగానే రిజ్వీ వీఆర్‌ఎస్‌ను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సీఎస్‌కు లేఖ రాయగా, తాజాగా ఆ లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో రిజ్వీ రాజీనామాపై అనుమానాలు మరింత పెరిగాయి. ఈ సందర్భంగా రిజ్వీపై మంత్రి జూపల్లి(minister-jupally-krishna-rao) సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.  

Also Read :  హైదరాబాద్‌లో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం..

Panchayat With Minister

సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు పేర్కొన్నప్పటికీ కానీ ఇప్పటికే పలు మార్లు బదిలీలు, పని చేయనీయడం లేదన్న అసంతప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అవేమీ వీఆర్‌ఎస్‌లో పేర్కొనకుండా కేవలం వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలోనే నాలుగు శాఖలకు బదిలీ చేయడంపైనా రిజ్వీ మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేనాటికి రిజ్వీ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఉన్నారు. డిసెంబర్‌ 14న విద్యుత్తుశాఖ కార్యదర్శిగా జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్‌, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత 2024 జూన్‌ 24న మరోసారి బదిలీ చేసి కమర్షియల్‌ ట్యాక్స్‌ సెక్రటరీగా నియమించింది. ఆ తర్వాత ఆయనకు ఎక్సైజ్‌శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. గత నెల 26న జరిగిన బదిలీల్లో ఆయనను సాధారణ పరిపాలనావిభాగం (జీఏడీ-పొలిటికల్‌) కార్యదర్శిగా నియమించింది.  దీంతో ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు సన్నిహితుల వద్ద వాపోయారని టాక్‌.

అయితే జూపల్లి లేఖలో మాత్రం ఇందుకు భిన్నంగా ఆరోపణలు చేయడం గమనార్హం. ఆయన అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. విధుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా లేఖలో పేర్కొనడం సంచలనంగా మారింది. మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగించారని జూపల్లి ఆరోపించారు. దీంతోపాటు శాఖలో ఆయన చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ వేసే కాంట్రాక్ట్‌ను 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇది మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. పాతవారికే అవకాశాలు ఇస్తూ వస్తున్నారని లేఖలో తెలిపారు.  వీటితో పాటు ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధర విషయంలో కూడా జాప్యంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందని తెలిపారు. ప్రతి ఫైల్‌ను సీఎంవోకు పంపుతున్నారని మరో ఫిర్యాదు చేశారు. ప్రతి పని కూడా మంత్రిమండలి ఆమోదం కావాలని చెప్పడం కూడా బాగా లేదన్నారు జూపల్లి. ఇలా పలు ఆరోపణలు చేస్తూ జూపల్లి రాసిన లేఖ సంచలనంగా మారింది. కాగా ఈ వివాదం తాజాగా హాట్‌ టాఫిక్‌గా మారింది.

Also Read: "కేక్ కట్ చేస్తున్న బాహుబలి.. కుకింగ్ చేస్తున్న సలార్".. ఏం క్రియేటివిటీ రా అయ్యా!

Advertisment
తాజా కథనాలు