/rtv/media/media_files/2025/09/01/mancherial-crime-news-2025-09-01-11-33-01.jpg)
Mancherial Crime News
క్రికెట్ బెట్టింగ్(cricket-betting) ప్రపంచం మోసాల మాయాజాలం. క్షణాల్లో డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఎంతోమంది అమాయకులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్ల వెనుక దాగి ఉన్న మోసగాళ్లు, గ్యారంటీ లాభాల పేరుతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. మొదట్లో చిన్న చిన్న లాభాలు చూపించి.. ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి, చివరికి వారిని నిండా ముంచుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ను నమ్ముకున్నవారిలో చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయి.. తమ ఆస్తులను, భవిష్యత్తును కోల్పోతున్నారు. ఇది కేవలం డబ్బు పోగొట్టుకోవడమే కాదు.. జీవితాలను నాశనం చేసే ఒక ప్రమాదకరమైన జూదం. తాజాగా తెలంగాణలో SBI ఉద్యోగులు చేసిన కుంభకోణం బయట పడింది.
కస్టమర్ల బంగారంతో క్రికెట్ బెట్టింగ్..
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్‌బీఐ బ్యాంకు(sbi-bank) లో ఓ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడి దాదాపు రూ. 40 లక్షలు నష్టపోయిన బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్, తన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏకంగా కస్టమర్ల బంగారాన్నే తాకట్టు పెట్టాడు. ఈ మోసం వెనుక బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్యాషియర్ రవీందర్, మేనేజర్ మనోహర్, సందీప్ కలిసి ఓ పథకం ప్రకారం.. కస్టమర్ల బంగారం బయటకు తీశారు. వారు ఈ బంగారాన్ని ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీలైన కొంగొండి ధీరజ్, కొడతి రాజశేఖర్, బొల్లి కిషన్‌లకు ఇచ్చి లోన్లు తీసుకున్నారు. అక్టోబర్ నుంచి ఈ మోసం కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా 402 మంది కస్టమర్లకు చెందిన 25.17 కిలోల బంగారాన్ని బ్యాంకు నుంచి తీసి వేర్వేరు ప్రైవేట్ కంపెనీలలో తాకట్టు పెట్టారు.
ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 32 మంది
తాకట్టు పెట్టిన బంగారం(gold) ద్వారా వచ్చిన డబ్బును మొదట ధీరజ్, రాజశేఖర్, కిషన్ ఖాతాల్లో జమ చేశారు. తర్వాత వారు కొంత కమిషన్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని రవీందర్ ఖాతాలోకి బదిలీ చేశారు. ఆ మొత్తాన్ని రవీందర్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లలో పెట్టుబడిగా పెట్టాడు. ఈ డబ్బు మొత్తం విదేశాలకు తరలిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. బ్యాంకు ఆడిటింగ్ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఈ మోసం బయటపడింది. వెంటనే బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ చెన్నూరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి రవీందర్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేయడంతో నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో క్యాషియర్ రవీందర్, బ్యాంకు మేనేజర్ మనోహర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌తో పాటు మొత్తం 47 మందిపై కేసు నమోదు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. నిందితుల నుంచి 15.23 కిలోల బంగారం, రూ. 1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: వీడసలు మనిషేనా.. తాగుడుకు డబ్బులివ్వలేదని మిక్సీ వైరుతో భార్యను చంపిన భర్త