/rtv/media/media_files/2025/08/19/g-ranjith-reddy-2025-08-19-15-32-50.jpg)
G. Ranjith Reddy
Former MP Ranjith Reddy : చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు రంజిత్ రెడ్డికి ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు.ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాయి. డీఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో లావాదేవీలు జరిపిన నేపథ్యంలోనే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్విహించారని తెలుస్తోంది. పన్ను చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే అనుమానంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డికి, డీఎస్ఆర్ గ్రూపుకి మధ్య పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిగినట్లు ఈ తనిఖీల్లో తేలింది.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!
రంజిత్ రెడ్డితో పాటు సంస్థ సీఈవో సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, సూరారం, నెల్లూరు, బెంగళూరు తదితర మొత్తం 30 చోట్ల 30 బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా సంస్థ చేసిన చెల్లింపులు, బకాయిలు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఉదయం 5 గంటలకే రంజిత్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ మధ్య సోదాలు కొనసాగిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
DSR గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి తెలంగాణ, కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫిలింనగర్‌లో నిర్మిస్తున్న DSR ప్రాజెక్ట్‌పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో భాగంగా DSR The World ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు. 14.45 ఎకరాలలో 9 టవర్లు, 344 యూనిట్స్‌తో భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కో ప్లాట్ రూ. 12 కోట్లు నుండి రూ. 15 కోట్లుకు అమ్మకాలు చేస్తున్నట్లు తేల్చారు అధికారులు. DSR కంపెనీ ఇప్పటి వరకు 34 బడా ప్రాజెక్ట్‌లు నిర్మించినట్లు గుర్తించిన ఐటీ. ఈ మేరకు సోదాల్లో వందల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సోదాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో కీలకమైన పత్రాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఐటీ అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ