/rtv/media/media_files/2025/08/07/if-applying-for-a-birth-certificate-a-death-certificate-2025-08-07-19-39-01.jpg)
If applying for a birth certificate... a death certificate
Khammam : బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ఎమ్మార్వో కార్యాలయంలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలంగట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి విద్య అనే నాలుగేళ్ల బాలిక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తహసీల్ ఉద్యోగుల తీరు విమర్శలకు తావిచ్చింది. తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికెట్ కోసం పుట్టిన నాలుగేళ్ల తరువాత దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీలో రికార్డులు లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. దీంతో వారు నేలకొండపల్లి ట్రెజరీలో 2024 డిసెంబర్ 17న చలానా కట్టి కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి జతపరిచిన పత్రాలు సరిగ్గా లేవంటూ కాలయాపన చేసి తాజాగా బర్త్ సర్టిఫికెట్ జారీ చేసిన కూసుమంచి తహసిల్దార్.
Also Read:Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
ఆగస్టు 4 వ తేది బర్త్ సర్టిఫికెట్ కోసం కార్యాలయానికి వెళ్లగా బర్త్ సర్టిఫికెట్ తహసీల్దార్ కార్యాలయం ముద్ర వేసి ఇచ్చారు. బాలిక తల్లి మమత సర్టిఫికెట్ ను ఫొటో తీసుకుంది. అయితే నిశితంగా పరిశీలించగా బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఉంది.అది డెత్ సర్టిఫికెట్ అవ్వడంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు.ఇదేంటని ప్రశ్నించిన బాధితులపై దుర్భాషలాడి దాన్ని వెంటనే చింపేసిన సెక్షన్ అధికారి.. మీకు సర్టిఫికెట్ ఇవ్వడమే కష్టం. ఇవ్వను పో అంటూ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత కంప్యూటర్‌లో సవరణలు చేసి కొత్తగా బర్త్ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అయితే, ఆ కొత్త సర్టిఫికెట్‌లో కూడా సరైన వివరాలు నమోదు చేయలేదు. సరైన వివరాలు నమోదు చేయాలని బాలిక తల్లి కోరగా.. సంబంధిత రెవెన్యూ అధికారి ఆమెతో దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, ఇష్టానుసారంగా మాట్లాడారని మమత ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read : ఓటర్ల జాబితా దేశ సంపద.. బీజేపీకోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోంది. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రకమైన నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనవసరమైన ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు.ఈ ఘటనపై తహసీల్దార్ రవికుమార్ స్పందిస్తూ, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సరైన పత్రం జారీ చేస్తామని తెలిపారు.
Also Read:సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు