Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీలోని పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది.

New Update

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికి చాలా ఘటనలు అలాంటివే చోటుచేసుకున్నాయి. తాజాగా మరొక ఘోరమైన ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘోరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీలోని పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Annamayya District Road Accident

ములకలచెరువు మండలం, పెద్దపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్(26), తరుణ్(24), మనోజ్(19) అనే ముగ్గురు యువకులు తమ మోటార్‌బైక్‌పై ములకలచెరువు నుంచి స్వగ్రామం కూటగుళ్లోపల్లికి వెళ్తున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పెద్దపాలెం ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే.. ఎదురుగా కదిరి నుంచి మదనపల్లె వైపు వచ్చిన పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు బైక్‌పై నుంచి ఎగిరి పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ములకలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం యువకుల జేబుల్లో లభించిన ఆధారాల ద్వారా వారిని గుర్తించారు. ఈ ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందిన చిన్నాన్న, పెదనాన్న పిల్లలని పోలీసులు నిర్ధారించారు. అందులో బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న ఓబులేసు కుమారుడు మనోజ్, డిగ్రీ పూర్తిచేసిన చంద్రప్ప కుమారుడు వెంకటేష్, ఐటీఐ పూర్తిచేసిన వేమనారాయణ కుమారుడు తరుణ్ ఉన్నారు. 

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని, తమ పిల్లల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోడ్డుప్రమాదంపై ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై స్థానిక నాయకులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరో ఘోరమైన యాక్సిడెంట్

ఇలాంటిదే ఏపీలో మరో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బొగ్గు లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. అతి అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మరణించగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఓ ప్రైవేట్ బస్సు ఒంగోలు నుంచి బెంగళూరుకు బయల్దేరింది. మార్గ మధ్యంలో డ్రైవర్ బస్సు వేగాన్ని మరింత పెంచాడు. అదే సమయంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నాయుడుపేట వద్దకు రాగానే.. ఎదురుగా బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేయబోయాడు. దీంతో ఆ బస్సు అదుపుతప్పి లారీని ఒక్కసారిగా వెనుకనుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు