UAPA: ఉపా కేసుపై మజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్టు.. అసలేంటి ఈ చట్టం ?

సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నాయకుడు గాదె ఇన్నయ్య అరెస్టు అయ్యారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
former maoist gade innayya arrested

former maoist gade innayya arrested

సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నాయకుడు గాదె ఇన్నయ్య అరెస్టు(former-maoist-gade-innayya-arrested) అయ్యారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లాలోని జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య నడిపిస్తున్న అనాథాశ్రమానికి వెళ్లిన NIA అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Also Read: పాలమూరు, దిండి ప్రాజెక్టుు ఎందుకు పూర్తి చేయలేదు..మంత్రి ఉత్తమ్

రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నయ్య పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి మీడియాతో మాట్లాడారు. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పోలీసులు ఇన్నయ్యను ఉపా (UAPA) చట్టం  కింద కేసు నమోదు చేశారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలతో సహా సంస్మరణ సభలో పాల్గొనడం, నిషేధిక తీవ్రవాద సంస్థలకు సపోర్ట్‌ ఇవ్వడం, వాళ్ల ఉద్యమాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే NIA అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. 

గతంలో ఉపా కేసు కింద అరెస్టు అయినవాళ్లు వీరే 
గతంలో దేశవ్యాప్తంగా పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలపై ఉపా కింద కేసు నమోదు చేశారు. భీమా కోరేగావ్‌ కేసుకు సంబంధించి ప్రముఖ విప్లవ కవి వరవరరావు ఉపా కింద అరెస్టు చేశారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎస్‌ సాయిబాబాకు మావోయిస్టలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు. 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్రలో పలువురు విద్యార్థులపై కూడా ఉపా కింద అదుపులోకి తీసుకున్నారు. పలువురు జర్నలిస్టులపై కూడా ఈ కేసులు నమోదయ్యాయి. 

ఉపా కేసు అంటే 

దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు 1967లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (UAPA) తీసుకొచ్చారు. 2004, 2019లో ఈ చట్టంపై పలు సవరణలు చేయడంతో ఇది మరింత శక్తిమంతంగా మారింది. సాధారణ కేసుల్లో చూసుకుంటే నేరం నిరూపితమయ్యే వరకు నిందితుడు నిర్దోషిగా ఉంటాడు. కానీ 'ఉపా' కింద కేసు నమోదైతే మాత్రం నిందితుడు తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యత అతనిపైనే ఉంటుంది. ఈ చట్టం కింద కేసు నమోదైతే ఇందులో బెయిల్ రావడం చాలా కష్టం.

Also Read: కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ వాడొద్దని ఆదేశం

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఉగ్రవాదాలు, నిషేధిత సంస్థలతో సంబంధాలు, హింసను ప్రేరేపించడం లాంటివి చేస్తే ఉపా చట్టం కింద పోలీసులు అరెస్టు చేస్తారు. ఇలాంటి ఆరోపణలతోనే విప్లవ కవి వరవరరావుతో పాటు ప్రొఫెసర్ ఆనంద్ తెలితుంబ్డే, గౌతమ్ నవలఖా వంటి 16 మంది మేధావులను అరెస్టు చేశారు. ఇందులో ఫాదర్ స్టాన్ స్వామి బెయిల్ రాక జైలులోనే మరణించడం తీవ్ర దుమారం రేపింది. మాజీ ప్రొఫెసర్ జీఎస్‌ సాయిబాబా కూడా ఈ కేసులో అరెస్టయ్యి బెయిల్‌పై బయటికి వచ్చాక మృతి చెందడం కలకలం రేపింది. 

ఇదిలాఉండగా కేంద్ర హోం శాఖ గణాంకాల ప్రకారం చూసుకుంటే 2018-2022 మధ్య దేశవ్యాప్తంగా 5,023 ఉపా కేసులు నమోదయ్యాయి. దీని కింద 8,947 మందిని అరెస్టు చేశారు. అయితే వీళ్లలో నేరం నిరూపితమై శిక్ష పడుతున్న వారు కేవలం 3 శాతం లోపు ఉండటం గమనార్హం. అంటే మెజారిటీ ప్రజలు ఏళ్ల తరబడి విచారణ ఖైదీలుగానే జైళ్లలో గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. శాంతి భద్రతల కోసం ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లను అణిచివేసేందుకు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు