/rtv/media/media_files/2025/11/22/fotojet-2025-11-22t131440175-2025-11-22-13-17-02.jpg)
Party Defection Law
Party Defection Law : ఒక పార్టీలో గెలవడం, మరో పార్టీలో చేరడం. అక్కడ మంత్రి పదవి రాకపోతేనో, మరో కారణంతోనో మరో పార్టీలోకి మారడం. పార్టీ అధికారం కోల్పోతుందంటే అధికారం చేపట్టే పార్టీలో చేరడం ఈ మధ్య ఈ ఊపు మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇవన్నీ ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే ప్రమాదకర చర్యలు. వీటిని అరికట్టేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్ని చేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో అనర్హత వేటుకు అవకాశం ఏర్పడటంతో జంపింగ్‌ల జోరు తగ్గింది. రాజకీయ అవినీతికి, అనిశ్చితికి, అస్థిరతకు కారణమవుతున్న పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలంగాణలో ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. బీఆర్‌ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వారిపై అనర్హత వేటు(brs mla's defection case) వేయాలని బీఆర్‌ఎస్ కోరుతోంది. ఈ క్రమంలో ఆ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఫిరాయింపు..
ఒక రాజకీయ పార్టీ(political-party) తరఫున పోటీ చేసి చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు అధికార దాహంతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరొక రాజకీయ పార్టీలోకి మారుతుంటారు. దీన్నే ‘పార్టీ ఫిరాయించడం’ అంటారు. దీన్ని నియంత్రించడానికి ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ అమలు చేస్తున్నారు.
చారిత్రక నేపథ్యం..
1967లో హరియాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ‘గయాలాల్’ అనే శాసన సభ్యుడు ఒకే రోజులో రెండు రాజకీయ పార్టీలు మారాడు. అలా 15 రోజుల్లో మూడు రాజకీయ పార్టీలు మారడం ఆనాడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీన్ని ఆధారంగా చేసుకుని పార్టీ ఫిరాయింపులను ‘ఆయారామ్ - గయారామ్ సంస్కృతి’ గా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుంటారు.
రాజ్యాంగ వివరణ..
రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి, దానిలో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ వివరించింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి, బలోపేతం చేయడం. ఆర్టికల్స్ 101, 102 190, 191ల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు.
చట్టంలోని ముఖ్యాంశాలు..
‘సభ’ అంటే పార్లమెంటులోని ఉభయ సభలు లేదా రాష్ట్ర శాసనసభ అని అర్థం. దీని ప్రకారం చట్ట సభలకు ఎన్నికైన సభ్యులను పలు సందర్భాల్లో అనర్హులుగా ప్రకటిస్తారు.
* ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు.
* స్వతంత్ర అభ్యర్థిగా చట్ట సభకు ఎన్నికైన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరినప్పుడు.
* సభలో తన పార్టీ జారీ చేసిన ఆదేశాలకు (విప్) విరుద్ధంగా సభ్యుడు ఓటువేసినా, సభకు గైర్హాజరైన సందర్భంలో.
* సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన రోజు నుంచి 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు.
Also Read: మోక్షజ్ఞ 'ఆదిత్య 999'పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన బాలయ్య..!
మినహాయింపులు.. ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన సభ్యులకు ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు.
* ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరొక రాజకీయ పార్టీలోకి మారినప్పుడు వారికి కూడా ఈ చట్టం వర్తించదు.
* లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ ఛైర్మన్, డిప్యూటీ ఛైౖర్మన్‌లు తమ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు.
సభాధ్యక్షులకే నిర్ణయాధికారం..పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల అనర్హతలను ప్రకటించే నిర్ణయాధికారం ఆయా సభాధ్యక్షులకే ఉంటుంది. లోక్‌సభ సభ్యుల అనర్హతలను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ సభ్యుల అనర్హతలను రాజ్యసభ ఛైర్మన్, విధానసభ సభ్యుల అనర్హతలను విధానసభ స్పీకర్, శాసన మండలి సభ్యుల అనర్హతలను శాసన మండలి ఛైర్మన్ ప్రకటిస్తారు.
* పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఓటు వేయడం మొదలైన అంశాలు వివాదస్పదంగా మారినప్పుడు ఈ వివాదాలపై అంతిమ నిర్ణయాధికారం సభాధ్యక్షులదే.
Also Read: పంచాయతీలకు ఎన్నికలు జరిగేనా? నిధులు వచ్చేనా?
సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేయగలిగిన సందర్భాలు:
ఎ) ఎలాంటి ఆధారాలు లేకుండా సభాధ్యక్షులు రాజకీయ పార్టీ విలీనానికి అంగీకరించినప్పుడు
బి) సభ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షులు విఫలమైనప్పుడు
సి) ఫిర్యాదులపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోవడంలో అలసత్వం వహించినప్పుడు.
సభాధ్యక్షులకే నియమాలను రూపొందించే అధికారం: రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది. అవి-
ఎ) చట్ట సభలోని సభ్యులు ఒక రాజకీయ పార్టీలో చేరినప్పుడు సంబంధిత విషయాన్ని ఆ రాజకీయ పార్టీ ఎవరికి, ఎప్పటి లోపల రిపోర్ట్ చేయాలనే అంశాలపైన.
బి) ఫిరాయింపులకు పాల్పడిన పార్టీకి చెందిన సభ్యుడిని క్షమించే విషయాల గురించి ఆ పార్టీ నాయకుడు ఎన్ని రోజుల్లోగా ఎవరికి పంపాలనే అంశాలపైన.
సి) ఈ అంశాలు/నియమాలు సభ ఆమోదం పొందిన తర్వాత 30 రోజుల నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నియమాలను ఎవరైన సభ్యులు ఉల్లంఘిస్తే సభా ఉల్లంఘనగా భావించి సభాధ్యక్షులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read: డంపింగ్ యార్డ్‌లతో కంపు కొడుతున్న పట్టణాలు..లక్షలు ఖర్చు చేసినా ఈ సమస్యకు లేని శాశ్వత పరిష్కారం
91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003: వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగసవరణ చట్టం-2003 ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించింది. అది 2004 నుంచి అమల్లోకి వచ్చింది.
సవరణ చట్టంలోని కీలకాంశాలు
ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే, ఆ సభ్యుడు ఆ సభాకాలంలో మంత్రి పదవిని చేపట్టడానికి అనర్హుడు అవుతాడు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన చట్టసభ సభ్యుడు ఎలాంటి లాభదాయక పదవులను చేపట్టరాదు.
రాజ్యాంగ అధికరణం 75 (1ఏ) ప్రకారం.. కేంద్రమంత్రిమండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు. అధికరణం 164 (1ఏ) ప్రకారం రాష్ట్రమంత్రి మండలి సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి శాసనసభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు. చిన్న రాష్ర్టాల్లో మంత్రిమండలి సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 12 మందికి తక్కువ ఉండకూడదు.
Also Read: భారతీయులలో పెరుగుతున్న ఊబకాయం..అంతా ఫుడ్ డెలివరీ వల్లనే..
సుప్రీంకోర్టు కీలక తీర్పులు.. స్పీకర్ నిర్ణయంపై కోర్టులో సవాల్
1993లో కిహోట హాల్లో హాన్ వర్సెస్ జాచిల్హూ కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్‌ది తుది నిర్ణయం అయినప్పటికీ, దీనిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొన్నది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడం రాజ్యాంగబద్ధమేనని చెప్పింది.
సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు..
చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతడిని ఆ సభకు చెందని వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే, ఆ వ్యక్తి పాత రాజకీయ పార్టీలో సభ్యుడిగానే కొనసాగుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి వేరే రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే. ఈ సందర్భంగా అతన్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఈ మేరకు 1996లో జీ విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
రాజ్యసభలో శాసనసభ్యుడి విషయంలో..
2006నాటి కులదీప్‌నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారం.. రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుడు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటేస్తే పదో షెడ్యూల్ ప్రకారం అతనిపై పడే అనర్హత ఉనికిలోకి రాదు. అయితే, రాష్ట్ర శాసనమండలి సభ్యుల విషయంలో ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.
స్పీకర్ నిర్ణయంలో జాప్యంపై..
ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని 2024 జనవరిలో మహారాష్ట్రలోని శివసేన(ఠాక్రే-షిండే), ఎన్సీపీ (శరద్-అజిత్) కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలనిచ్చింది.
Follow Us