Smita Sabharwal: సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల రిజర్వేషన్ పై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలపై ఏ మాత్రం వెనక్కు తగ్గని స్మితా మరో సంచలన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ‘కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు. స్వరం వణుకుతున్న నిజాన్నే మాట్లాడండి’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అయితే ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారనే చర్చ మొదలైంది.
A career maybe born in public.
But strength of character and purpose is nurtured in privacy.Speak your truth even if the voice shakes ♥️ pic.twitter.com/dIJkfzpMDe
— Smita Sabharwal (@SmitaSabharwal) July 25, 2024
ఇక ఇటీవల స్మితా వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క.. ఈ అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలు తగవని, సామాజిక మాధ్యమాల వేదికగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ ప్యూడల్ భావజాలాన్ని కలిగి ఉన్నారన్నారు. అలాంటి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. ఫిజికల్ ఫిట్ నెస్‌కు సివిల్ అధికారుల పనితీరుకు సంబంధం లేదన్నారు. ఫిట్ నెస్ అనేది దేవుడు ఇచ్చేదని, మానసిక అంగవైకల్యం ఉన్నవారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ప్రస్తుత సమాజంలో దివ్యాంగులు చాలా విభాగాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.