/rtv/media/media_files/2026/02/19/supreme-court-2026-02-19-10-18-38.jpg)
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కొనసాగుతున్న గృహ హింస, భరణం కేసును కోల్‌కతా(kolkata) నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. జహాన్ పిటిషన్ పై స్పందించాలంటూ షమీ(mohammed-shami) తో పాటుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది. కోల్ కతాలో కొనసాగుతున్న ఈ కేసును ఇప్పుడు జహాన్ వాదనలను కోర్టు అంగీకరిస్తే ఢిల్లీకి మార్చవచ్చు.
హసిన్ జహాన్ తన పిటిషన్‌లో కేసు బదిలీకి ప్రధానంగా తన కుమార్తె భవిష్యత్తును ప్రస్తావించారు. ప్రస్తుతం తన కుమార్తె ఢిల్లీ(delhi) లోని ఒక ప్రముఖ పాఠశాలలో చదువుతోందని, ఆమె విద్యాభ్యాసం, సంరక్షణ కోసం తాము ఢిల్లీకి షిఫ్ట్ అయ్యామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రతిసారి కోల్‌కతా వెళ్లి కోర్టు విచారణలకు హాజరుకావడం తమకు ఇబ్బందిగా మారిందని ఆమె వివరించారు. అంతేకాకుండా, షమీ ఒక అంతర్జాతీయ క్రికెటర్ కావడంతో ఆయనకు దేశవ్యాప్తంగా ప్రయాణించే వనరులు ఉన్నాయని, ఢిల్లీలో కేసు నడిచినా ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆమె వాదించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హసిన్ జహాన్ పుట్టిల్లు ఉత్తరప్రదేశ్‌లో ఉండటం వల్ల కోల్‌కతా కంటే ఢిల్లీయే తమకు దగ్గరగా ఉంటుందని ఆమె కోర్టుకు తెలిపారు.
Also Read : రాజస్థాన్ రాయల్స్ భారీ స్కెచ్: గంభీర్‌కు కళ్లు చెదిరే ఆఫర్!
భరణం పెంచాలని
ఇదే సమయంలో భరణం పెంచాలన్న అంశంపై కూడా న్యాయపోరాటం నడుస్తోంది. గతంలో కోల్‌కతా హైకోర్టు హసిన్ జహాన్, ఆమె కుమార్తెకు కలిపి నెలకు రూ. 4 లక్షల భరణం చెల్లించాలని షమీని ఆదేశించింది. అయితే, ప్రస్తుత ఖర్చులు,షమీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. షమీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, తన కుమార్తెకు కూడా అదే స్థాయి జీవన ప్రమాణాలు కల్పించాల్సిన బాధ్యత తండ్రిగా ఆయనపై ఉందని ఆమె వాదిస్తున్నారు.
2014లో వివాహం చేసుకున్న ఈ జంట, 2018లో విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటి నుండి గృహహింస, వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలతో వీరి వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీకి క్లీన్ చిట్ లభించినప్పటికీ, వ్యక్తిగత వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. ఇప్పుడు కేసు ఢిల్లీకి బదిలీ అయితే షమీకి ఇది మరో తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
Also Read : పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ ప్రకంపనలు: బాబర్, షాహీన్‌లపై వేటు!
Follow Us