/rtv/media/media_files/2026/02/17/pak-2026-02-17-08-24-17.jpg)
టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన కీలక పోరులో ఘోర పరాజయం పాలైన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న మేనేజ్‌మెంట్.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ షా ఆఫ్రిదీలపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి ఖాయమని తెలియగానే, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మ్యాచ్ ముగియకముందే స్టేడియం నుంచి వెళ్ళిపోయారు. జట్టు ప్రదర్శనపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, టీమ్ మేనేజర్ నవేద్ అక్రమ్ చీమాకు తన అసహనాన్ని స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఇలాంటి ఆటతీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
పాక్ జట్టులో పెను మార్పులు
నమీబియాతో జరగబోయే తర్వాతి మ్యాచ్ కోసం పాక్ జట్టులో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఫామ్ కోల్పోయి తడబడుతున్న బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిదీలను బెంచ్‌కే పరిమితం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వీరి స్థానాల్లో సల్మాన్ మీర్జా లేదా నసీమ్ షా, అలాగే ఫఖర్ జమాన్‌లను బరిలోకి దింపాలని చూస్తున్నారు. యువ ఆటగాడు ఖవాజా నఫాయ్‌ను కూడా మిడిల్ ఆర్డర్‌లో పరీక్షించే అవకాశం ఉంది.
ఒకవేళ నమీబియాతో జరిగే మ్యాచ్‌లో కొత్త ఆటగాళ్లు రాణిస్తే, ఈ వరల్డ్ కప్‌లో బాబర్, షాహీన్‌ల ప్రస్థానం దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్ఏ, నెదర్లాండ్స్‌పై గెలిచినప్పటికీ.. భారత్‌తో ఓటమి పాక్ సూపర్-8 అవకాశాలను క్లిష్టతరం చేసింది. ఇప్పుడు నమీబియాపై గెలవడం పాకిస్థాన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.
Follow Us