Indian Shooters at Asian Games 2023: ఆసియా క్రీడల్లో మనవాళ్ళ పతకాల వేట కొనసాగుతోంది. భారత షూటర్లు అయితే అస్సలు గురి తప్పనివ్వడం లేదు. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పాలక్ గులియా (Palak Gulia) స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇషాసింగ్ (Esha Singh)రజత పతకం సొంతం చేసుకుంది. అలాగే ఇషా-పాలక్-దివ్య త్రయం మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. పురుషుల 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ కేటగిరీలో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్ (Aishwarya Pratapsinh Tomar), స్వప్నిల్ కుశాలే (Swapnil Kushale), అఖిల్ షెరాన్ (Akhil sheoran) బృందం ఏకంగా వరల్డ్ రికార్డుతో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుశాలే, అఖిల్ షెరాన్‌తో కూడిన భారత త్రయం అద్భుతంగా రాణించి ఏకంగా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో చైనా నుంచి గట్టి పొటీ ఎదుర్కొన్న భారత షూటర్లు 1769 పాయింట్లు ప్రపంచ రికార్డు స్కోరుతో బంగారు పతకం గెలుపొందారు. చైనా (1763 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా..కొరియా (1748) కాంస్యం అందుకుంది.
పాలక్ ఆసియాడ్ రికార్డ్..
మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్లో తొలి రెండు స్థానాలకోసం పాలక్ గులియా, ఇషాసింగ్ పోటీ పడ్డారు. అయితే 17 ఏళ్ల పాలక్ 242.1 పాయింట్ల ఆసియా రికార్డు స్కోరుతో విజేతగా నిలిచింది. 18 సంవత్సరాల హైదరాబాద్ షూటర్ ఇషాసింగ్ 239.7 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. పాకిస్థాన్‌కు చెందిన తలత్ కిస్మత్ (218.2) కాంస్య పతకం నెగ్గింది.
ఇషాకు మరో రెండు..
ఇషాసింగ్ ఆధ్వర్యంలోని పాలక్, దివ్య టీమ్ 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ కేటగిరీలో 1731 పాయింట్లతో రజతం సాధించింది. చైనా (1736 ఆసియాడ్ రికార్డు) స్వర్ణం, తైపీ (1723) కాంస్యం నెగ్గాయి. ఈసారి ఆసియా క్రీడల్లో ఇషాసింగ్‌కు ఇది నాలుగో పతకం. ఇంతకుముందు టీమ్ విభాగంలో (10మీ. ఎయిర్ పిస్టల్‌లో రజతం, 25మీ. పిస్టల్‌లో స్వర్ణం) రెండు, 25మీ. పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం ఇషా తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.. 50మీ. రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో పసిడి పతకం కొల్లగొట్టిన 22 ఏళ్ల ఐశ్వరీ ప్రతాప్ సింగ్..అనంతరం 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు.
18 పతకాలు పేలాయి..
ఆరు రోజుల్లో షూటర్లు 18 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో 6 స్వర్ణ, 7 రజతాలున్నాయి. 2006 ఆసియా క్రీడల్లో 14 పతకాలు సాధిస్తే ఈసారి మరో నాలుగు ఎక్కువే సొంతం చేసుకున్నారు. ఇంకా రెండు రోజులు పలు విభాగాల్లో షూటింగ్ ఈవెంట్లు జరగాలి. దీంతో మనకు మరిన్ని మెడల్స్ రావడం ఖాయం.
సాకేత్‌కు మూడో ఆసియాడ్ పతకం..
తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని రజత పతకం అందుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్-రామ్‌కుమార్ జోడీ 4-6, 4-6తో తైపీ జోడీ సు యు/జాసన్ జెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సాకేత్‌కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం కావడం విశేషం. 2014 ఇంచియాన్ ఆసియాడ్‌లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణం నెగ్గిన సాకేత్..సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం గెలుపొందాడు.
మిక్స్‌డ్‌లో పసిడి పోరుకు బోపన్న జోడీ..
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న/రుతుజా భొసాలే ద్వయం ఫైనల్‌కు దూసుకు పోయింది. సెమీఫైనల్లో బోపన్న/రుతుజ జోడీ 6-1, 3-6, 10-4తో చన్ హో/యు సు (తైపీ) జంటను చిత్తు చేసింది. ఫైనల్ చేరడంతో బోపన్న ద్వయం కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.
స్క్వాష్ మహిళల జట్టుకు కాంస్యం..
జోష్న చిన్నప్ప, తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్‌తో కూడిన త్రయం మహిళల స్క్వాష్ టీమ్ విభాగంలో కాంస్య చేజిక్కించుకుంది. సెమీఫైనల్లో భారత జట్టు 1-2తో హాంకాంగ్ చేతిలో ఓడింది. పురుషుల జట్టు స్వర్ణ పతక పోరుకు చేరింది. భారత జట్టు సెమీఫైనల్లో 2-0తో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాకు షాకిచ్చింది. శనివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌ను భారత జట్టు ఢీకొననుంది.
72 ఏళ్ళ తర్వాత షాట్ పుట్ లో...
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ పోటీల మొదటిరోజే భారత్ పతక బోణీ చేసింది. మహిళల షాట్‌పుట్‌లో కిరణ్ బలియా రజత పతకం అందుకుంది. ఫైనల్లో గుండును 17.36 మీ. విసిరిన 24 ఏళ్ల కిరణ్ ఆసియా క్రీడల మహిళల షాట్‌పుట్‌లో 72 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పతకం నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఎప్పుడో..1951లో ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఆసియా క్రీడల్లో అప్పటి బొంబాయికి చెందిన ఆంగ్లో ఇండియన్ బార్బరా వెబ్‌స్టర్ మొదటిసారి మహిళల షాట్‌పుట్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది.
Also Read: పాకిస్థాన్‌పై కివీస్, లంకపై బంగ్లా గెలుపు