Election Commission : ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?

దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

New Update
FotoJet - 2025-11-24T122109.417

What is the SIR undertaken by the Election Commission?

Election Commission :  దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని  నిర్ణయించింది. గతంలో బీహార్‌లో చేపట్టిన తొలి విడత SIR విజయవంతమైందని ఈసీ ప్రకటించింది. అయితే, ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అసలు SIR అంటే ఏంటి? ఇందులో ఏం చేస్తారు? దీనిపై వివాదం ఎందుకు అనే అంశాలను తెలుసుకుందాం.

SIR :

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది ఓటరు జాబితాలో సమగ్రతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేకమైన, గడువుతో కూడిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే వార్షిక సవరణ కంటే ఇది చాలా విస్తృతమైనదే కాకుండా, లోతైనది కూడా. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం అనేది ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా ఓటరు లిస్టులో పేరుండి మరణించినవారు, ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లినవారు లేదా అర్హత లేనివాళ్లను గుర్తించి తొలగించడం దీనిలో ముఖ్యం. అలాగే 18 ఏళ్లు నిండినా కూడా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోని వాళ్లను గుర్తించి వాళ్లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఒక ఓటరు, ఒకటికి మించి ఇతర చోట్ల కూడా ఓటరుగా నమోదై ఉంటే వాళ్లను గుర్తించి తొలగిస్తారు. దీనికోసం ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయడం ద్వారా పారదర్శకతను పెంచుతారు.

బూత్ లెవల్ ఆఫీసర్లు :

SIR ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లది(BLOs) కీలక పాత్ర. BLOలు ప్రతి ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్లి, ప్రతి ఓటరు వివరాలను వ్యక్తిగతంగా ధృవీకరించాలి. ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ వివరాలను ధృవీకరించుకోవడానికి, లేదా కొత్త ఓటర్లు నమోదు కోసం ఫారం 6 నింపాలి. లేదంటే తొలగించడానికి, మార్పులు చేర్పులకోసం ప్రత్యేక ఫారాలను నింపాల్సి ఉంటుంది. ఈసీ చివరిసారిగా 2002 – 2004 మధ్య చాలా రాష్ట్రాల్లో ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించింది. ఆ రివిజన్ ను కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకుని పోల్చి చూస్తారు. చివరి ఇంటెన్సివ్ రివిజన్ జాబితాలో తమ పేర్లు లేనివారు లేదా వారి తల్లిదండ్రుల పేర్లు లేనివారు తమ భారత పౌరసత్వం, వయస్సును రుజువు చేసే పత్రాలను సమర్పించాలి. డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి.. విచారించి.. వాటిని పరిష్కరిస్తారు. అన్ని అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.

రాజకీయ పార్టీల అభ్యంతరం :  

అయితే ఈ ప్రత్యేక రివిజన్ పై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం SIRను ఒక సాధారణ, సాంకేతిక ప్రక్రియగా చెబుతున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు దాని లక్ష్యం, సమయం, అమలుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. SIR ప్రక్రియలో కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న మైనారిటీలు, దళిత, వెనుకబడిన వర్గాలు, పేదలు, మహిళల పేర్లను లక్ష్యంగా చేసుకుని  వారిని తొలగించే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీహార్‌లో తొలి విడత SIR తర్వాత ముసాయిదా జాబితాలో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, ఇది ఓటర్ల హక్కులను కాలరాసిందని విమర్శిస్తున్నాయి. చివరి SIR జాబితాతో లింక్ చేయలేనివారు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి దస్త్రాలు సమర్పించాలనే నిబంధన, ముఖ్యంగా పేదలు, వలసదారులు, అట్టడుగు వర్గాల వారికి కష్టం అని, ఇది వారిని ఓటు హక్కుకు దూరం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల సంఘం ఖండన :

అయితే విపక్షాల అభ్యంతరాలను, ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ల జాబితాలో నకిలీలు, అనర్హులు లేకుండా చూడాలనే రాజకీయ పార్టీల డిమాండ్‌ల కారణంగానే ఈ ప్రక్రియ అవసరమైందని ఈసీ స్పష్టం చేసింది. బీహార్‌లో SIR విజయవంతమైందని, తుది జాబితా ప్రచురించాక ఒక్క అప్పీల్ కూడా రాలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో, రెండో విడతలో ప్రక్రియను మరింత సమ్మిళితంగా చేయడానికి మార్పులు చేసినట్లు ఈసీ తెలిపింది. ఉదాహరణకు, ఓటరును అతని తల్లిదండ్రులు లేదా ఇతర బంధువుల వివరాల ద్వారా కూడా పాత SIR జాబితాతో లింక్ చేసే అవకాశం కల్పించడం. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని అధికరణ 324, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21 (2) (a) ప్రకారం చట్టబద్ధమైనదని, ఓటర్ల జాబితా సమగ్రత కోసం ప్రతి 20 ఏళ్లకోసారి ఇటువంటి లోతైన సవరణ అవసరమని ఈసీ స్పష్టం చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాను క్లీన్ చేసే ప్రక్రియ అయినప్పటికీ, రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. సమగ్రత, పారదర్శకతను లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రక్రియ, అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు దక్కేలా చూసే విషయంలో కచ్చితత్వం, సమ్మిళితత్వం మధ్య సమతుల్యత సాధించడంపైనే దీని విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల భాగస్వామ్యం, ఈసీ పర్యవేక్షణ ఈ బృహత్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisment
తాజా కథనాలు