/rtv/media/media_files/2026/02/02/ugc-rules-explained-2026-02-02-14-51-35.jpg)
UGC rules explained
దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త రూల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జనరల్ కేటగిరీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. జనరల్ కేటగిరీ విద్యార్థులు అభద్రతా భావానికి గురయ్యేలా ఈ రూల్స్ ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించారు. దీంతో ఈ రూల్స్ అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇంతకీ యూజీసీ కొత్త నిబంధనలు ఏంటి ?. జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
యూజీసీ రూల్స్
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) జనవరి 13న కొత్త నిబంధనలను ప్రకటించింది. కులం, మతం, లింగం, వైకల్యం లేదా పుట్టిన ప్రాంతం ఆధారంగా విద్యార్థులు, అధ్యాపకులు లేదా సిబ్బందిపై ఎవరూ ఎలాంటి వివక్ష చూపకూడదు. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ విద్యార్థులను కూడా చేర్చారు. ఈ వర్గాలపై వివక్షను అరికట్టేందుకు ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో కచ్చితంగా 'ఈక్విటీ కమిటీ'లను ఏర్పాటు చేయాలి. ఏదైనా వివక్షపై ఫిర్యాదు అందితే.. 24 గంటల్లోపే ఈ కమిటీ సమావేశం కావాలి. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. 7 రోజుల్లోనే చర్యలు తీసుకోవాలి. అలాగే విద్యార్థుల కోసం 24/7 హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలి. రూల్స్ పాటించని విద్యా సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు నిలిపివేయడం లేదా వాటి గుర్తింపును రద్దు చేసే అధికారం UGCకి ఉంటుంది.
అభ్యంతరాలు
UGC కొత్త నిబంధనలు కేవలం రిజర్వ్‌డ్ కేటగిరీల (SC, ST, OBC) రక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నాయని జనరల్ కేటగిరీ విద్యార్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తాము వివక్షకు గురైతే ఫిర్యాదు చేసే అవకాశం లేదని వాపోతున్నారు. ఎవరైనా జనరల్ కేటగిరీ విద్యార్థులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తే వాళ్లపై తీసుకునే చర్యల గురించి నిబంధనల్లో స్పష్టంగా లేదని అంటున్నారు. ఇది ఇతరులను వేధించేందుకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read: వరదలో పాకిస్తాన్‌కు కొట్టుకుపోయిన భారతీయులు.. ఏడాది శిక్ష తర్వాత రిలీజ్
సుప్రీంకోర్టు స్టే
ఈ నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వీటివల్ల విద్యా సంస్థల్లో కొత్త విభజనలు వచ్చే ఛాన్స్ ఉందని భావించింది. ఈ నిబంధనలు అమలు చేస్తే సమాజంలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే కొత్త రూల్స్‌పై స్టే విధించింది. 2012 నాటి పాత యూజీసీ నిబంధనలే ఇందులో కొనసాగుతాయని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.
కేంద్రం వివరణ
UGC కొత్త రూల్స్‌పై జనరల్ కేటగిరి విద్యార్థులు నిరసనలు చేస్తుండటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని దీనిపై స్పందించారు. ఈ కొత్త రూల్స్‌ను ఎవరూ దుర్వినియోగం చేయకుంటా చూస్తామని తెలిపారు. ఎవరిపై కూడా వివక్ష ఉండదని హామీ ఇచ్చారు. గతంలో రోహిత్ వేముల, పాయల్ తద్వి లాంటి విద్యార్థులు సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చిందని.. వాటి మేరకే ఈ మార్పులు తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
Also Read: బంగ్లాదేశ్‌కు భారత్ బిగ్ షాక్! 2026 బడ్జెట్‌లో భారీ కోత
Follow Us