/rtv/media/media_files/2025/08/20/tough-fight-for-vice-president-elections-2025-08-20-18-20-31.jpg)
Tough fight for vice president elections
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థికి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఈ పోటీకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వనుంది. విపక్ష పార్టీలన్నీ కలిసి రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ఎన్డీయే తరఫున బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పోటీలోకి దిగారు. ఉపరాష్ట్రపతిని ఉభయసభల ఎంపీలు ఎన్నుకుంటారు. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభలో మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారు. మోజార్టీకి 391 ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం NDAకు 425 మంది సభ్యుల మద్దతు ఉంది.
ఇటీవల వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికి తమ సపోర్ట్ ఇవ్వడంతో ఈ మెజార్టీ 432కు చేరింది. విపక్ష కూటమి వైపు 311 మంది సభ్యులు ఉన్నారు. ఈ అంకెలు చూసుకుంటే సీపీ రాధాకృష్ణనే గెలుస్తారనేది స్పష్టమవుతోంది. ఓటమి తప్పదని తెలిసినప్పటికీ కూడా ఇండియా కూటమి ఈ పోటీని సీరియస్‌గా తీసుకుంటోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వానికి ఏకగ్రీవ ఎన్నికతో విజయం ఇవ్వకూడదని పట్టుబడుతోంది. అలాగే విపక్ష పార్టీలన్నీ కూడా ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏకతాటి పైకి రావాలనే సందేశం కూడా వెళ్లనుంది. లౌకిక పార్టీలైన టీడీపీ, జేడీయూ ఎన్డీయే కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలకు కూడా తమ బలమేంటో చూపించాలని ఇండియా కూటమి భావిస్తోంది.
Also Read: సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది కుక్కల ప్రేమికుడే.. పక్కా ప్లాన్‌తో దాడి చేశాడా?
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపిన మోదీ సర్కార్ డీఎంకేను ఇబ్బందిలో పెట్టాలనుకుంటోంది. తమిళనాడులో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవి ఫలించడం లేదు. అందుకోసమే ఈసారి తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ లీడర్‌ను ఉపరాష్ట్రపతి చేయాలనుకుంటోంది. మరోవైపు ఇండియా కూటమి.. తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నేతలు తెలుగు అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఏపీపీసీ చీఫ్ షర్మిల కూడా చంద్రబాబును, జగన్‌ను సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు అభ్యర్థికి ఓటు వేయకపోవడం వల్ల టీడీపీకి వ్యతిరేకత వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: టీచర్‌ని లవ్ చేసిన స్టూడెంట్.. ఆ కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు
ఒడిశా ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన బీజేడీ కూడా ఎన్డీయే అభ్యర్థికి సపోర్ట్ చేయడం లేదు. జాతీయ స్థాయిలో బీజేడీ బలమైన విపక్ష పాత్ర పోషించాలని భావిస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది కేవలం గెలుపు,ఓటమి గురించి కాదు. అధికార, విపక్ష పార్టీల మధ్య సాగే పోరాటం, వ్యూహాలకు ఇది కీలకంగా మారనుంది. ఇదిలాఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఇటీవల జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యల వల్లే తాను పదవి నుంచి వైదొలగినట్లు చెప్పుకొచ్చారు. కానీ విపక్షాలు మాత్రం ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. బీజేపీకి, ధన్‌ఖడ్‌కు వ్యక్తిగత వివాదాలు తలెత్తడం వల్లే ఆయన తన పదవికి రాజీనామా చేశారని ఆరోపణలు చేశాయి.