ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమితో కలవకుండా ఒంటరిగానే పోటీచేస్తోంది. ఈ నేపథ్యంలనే ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య భేధాభిప్రాయాలు వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ రాజకీయంగా ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించేందుకు ఇతర మిత్రపక్ష పార్టీలను కలుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడం దుమారం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దిగింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2100, సీనియర్ సిటిజెన్స్‌కు ఉచిత వైద్యంతో పాటు పలు హామీలు ఇచ్చింది. అయితే ఆప్ హామీలపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. అరవింద్ కేజ్రీవాల్ ఊహాజనితమైన సంక్షేమ పథకాలపై వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆప్ కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తి చెందింది. Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు ఇటీవల కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. 2013లో కాంగ్రెస్ పార్టీ ఆప్‌కు మద్దతు తెలపడం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిందని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మట్లాడారు. అజయ్ మాకెన్.. కేజ్రీవాల్‌ను యాంటీ నేషనల్ అని పిలవడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై 24 గంటల్లోనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు. ఢిల్లీలో బీజేపీ గెలిపించేందుకు కాంగ్రెస్ ఏదైనా చేస్తుందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ''అజయ్ మాకెన్ బీజేపీ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోతే.. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ను తొలగించాలని ఆప్ ఇతర మిత్రపక్షాలను కోరుతుందని'' సంజయ్ సింగ్ అన్నారు. మరోవైపు సీఎం అతిషి కూడా.. కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చులను బీజేపీ భరిస్తోందని చెప్పడం కూడా చర్చనీయాంశమవుతోంది. Also Read: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి '' బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు సమకూరుస్తోంది. సందీప్ దీక్షిత్ బీజేపీ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నారని మాకు తెలిసింది. కాంగ్రెస్.. ఆప్‌ను యాంటీ నేషనల్‌గా భావిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో మాతో కలిసి ఎందుకు పోటీ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు బీజేపీతో పరస్పర ఒప్పందం చేసుకున్నారని స్పష్టమవుతోందని'' అతిషి అన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఇదిలాఉండగా వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.