టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఎల్లుండి నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. పదిహేనురోజులుగా యాత్ర నిలిచిపోవడంతో దాని ప్రభావం పార్టీ మొత్తంపై పడుతోంది. ఓ వైపు చంద్రబాబు జైల్లో ఉండటం, మరోవైపు లోకేష్ అందుబాటులో లేకపోవడంతో పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయిన లోకేష్ తిరిగి రావాలని డిపైడ్ అయ్యారు. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు వస్తోంది. దీని తర్వాత లోకేష్ ఏపీకి రానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఎల్లుండి రాత్రి 8.15 ని. లకు లోకేష్ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ.. ఇటు యువగళం తో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని నారా లోకేష్ నిర్ణయించారు.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14 గా నారా లోకేష్ పేరును చేర్చుతూ ఎసిబి కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. ఒకపక్క తండ్రి అరెస్టు రిమాండ్ కొనసాగుతున్న తరుణంలోనే మరోపక్క తనయుడు కు సంబంధించిన మరో కేసు అందులో ఏ 14 నారా లోకేష్ పేరు చేర్చడంపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ లోని అశోక్ రోడ్ 50లో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో మంగళవారం టిడిపి ఎంపీలు అందుబాటులో ఉన్న టిడిపి నేతలతో మరోసారి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టు దారుణమని వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులుపై టిడిపి న్యాయ పోరాటం చేయాలని... నారా లోకేష్ ఇతర ఎంపీలు చర్చించారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని... తాము ఏ తప్పు చేయలేదని...పాదయాత్ర చేసి తీరుతామని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.
ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఆపార్టీ రాష్ట్ర నాయకులు చేరుకుంటున్నారు. సినీ యాక్టర్ మురళి మోహన్ తో పాటు పలువురు పార్టీ నేతలు నారా బ్రాహ్మణని కలిశారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేస్తూ అరెస్టును ఖండించారు.