Luggage Lost In Train: రైళ్లలో లగేజ్, విలువైన ఐటెమ్స్ మర్చిపోయారా..? ఒక్క క్లిక్‌తో సాయం పొందొచ్చు తెలుసా..!

భారతీయ రైల్వే ప్రారంభించిన రైల్ మదద్ యాప్ ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన సమగ్ర వేదిక. ఇది కేవలం లగేజీ పోగొట్టుకున్న సమస్యలకే కాకుండా.. అన్ని రకాల సమస్యలకు 24x7 పనిచేస్తుంది. దీనిలో అన్ని రకాల ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు.

New Update
Luggage Lost In Train

Luggage Lost In Train

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే నెట్‌వర్క్, ప్రయాణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలోనూ ముందుంటోంది. ముఖ్యంగా ప్రయాణికులు రైలులో విలువైన వస్తువులను, లగేజీని మరిచిపోయినప్పుడు(Luggage Lost In Train) ఎటువంటి డబ్బులు తీసుకోకుండా సహాయం అందిస్తోంది. రైలులో సామాను పోగొట్టుకున్నప్పుడు భయాందోళన చెందకుండా.. వెంటనే తిరిగి ఎలా పొందవచ్చో.. దానికి సంబంధించిన విధానాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పోయిన సామాను కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు:

రైలులో బ్యాగ్, పర్సు, మరేదైనా విలువైన వస్తువులను మరిచిపోతే.. రైల్వేస్‌కు వెంటనే ఫిర్యాదు చేయడమే మొదటి, ముఖ్యమైన చర్య. ఫిర్యాదు ఎంత త్వరగా నమోదైతే.. వస్తువుల అన్వేషణ అంత వేగంగా ప్రారంభమవుతుంది. సామాను పోగొట్టుకున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే అందించే అత్యంత సౌకర్యవంతమైన మార్గం రైల్ మదద్ (Rail Madad) డిజిటల్ ప్లాట్‌ఫారమ్. మీ మొబైల్‌లో Rail Madad యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత railmadad.indianrailways.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. యాప్ లేదా వెబ్‌సైట్‌లో పీఎన్‌ఆర్ (PNR) నంబర్ నమోదు చేయాలి. ఆ తరువాత పోగొట్టుకున్న లగేజీ వివరాలు (ఏం పోయింది, ఏ కోచ్‌లో, ఏ సీటు కింద లేదా పైన) స్పష్టంగా నమోదు చేసి ఫిర్యాదును సమర్పించాలి. ఫిర్యాదు అందిన వెంటనే రైల్వే అధికారులు, రైల్వే భద్రతా దళం (RPF) అప్రమత్తమై తదుపరి స్టేషన్‌లో తనిఖీలను ప్రారంభించి.. ఆ వస్తువులను గుర్తించేందుకు ప్రయత్నిస్తారు.

స్టేషన్ మాస్టర్-ఆర్పీఎఫ్ ఫిర్యాదు:

యాప్ వాడటం ఇష్టం లేకపోయినా లేదా అందుబాటులో లేకపోయినా.. ఈ విధానాన్ని పాటించవచ్చు. మీరు రైలు దిగిన స్టేషన్ లేదా ఆ తరువాత వచ్చే ముఖ్యమైన స్టేషన్ మాస్టర్ను సంప్రదించాలి. స్టేషన్‌లో ఉండే పోగొట్టుకున్న వస్తువుల కౌంటర్‌లో మీ వస్తువుల వివరాలను తెలియజేయాలి. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు సమాచారం ఇవ్వాలి. ఆర్పీఎఫ్ అధికారులు ఫిర్యాదును నమోదు చేసుకుంటారు. ఒకవేళ లగేజీ ఆచూకీ లభించకపోతే.. తప్పనిసరిగా ఆర్పీఎఫ్ వద్ద ఎఫ్ఐఆర్ (First Information Report) నమోదు చేయించాలి. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాతే రైల్వేలు ఆ మార్గంలో విస్తృత అన్వేషణను చేపడతాయి.

అన్ని సమస్యలకు పరిష్కారం:

భారతీయ రైల్వే ప్రారంభించిన రైల్ మదద్ యాప్ (Rail Madad App) ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన సమగ్ర వేదిక. ఇది కేవలం లగేజీ పోగొట్టుకున్న సమస్యలకే కాకుండా.. అన్ని రకాల సమస్యలకు 24x7 పనిచేస్తుంది. టికెటింగ్, భద్రత, పరిశుభ్రత, రైలు సౌకర్యాలు, వైద్య సహాయం, సిబ్బంది ప్రవర్తన వంటి అన్ని రకాల ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు. ఈ యాప్‌లో ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే అది సంబంధిత రైల్వే విభాగానికి (RPF, ఎలక్ట్రికల్, హౌస్ కీపింగ్, TTE) చేరుతుంది. దీనిపై రైల్వే బృందం తక్షణమే చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదు చేసిన ప్రయాణికులకు ఒక రిఫరెన్స్ నంబర్ (RRN) లభిస్తుంది. దీని ద్వారా తమ ఫిర్యాదు యొక్క తాజా స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. సమస్య పరిష్కారమైన తర్వాత ప్రయాణికుడి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటారు. యాప్, వెబ్‌సైట్‌తోపాటు ప్రయాణికులు ఏ సమస్యకైనా 139 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి లేదా ఎస్‌ఎంఎస్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి:  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అనేక హక్కులు ఉంటాయి.. అవేంటో తెలుసా..?

రైల్వే అధికారుల అన్వేషణ:

ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన తర్వాత రైల్వే అధికారులు ఆ లగేజీని గుర్తించడానికి ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తారు. ఫిర్యాదు వివరాలు తదుపరి స్టేషన్లలోని స్టేషన్ మాస్టర్‌లు, ఆర్పీఎఫ్ సిబ్బందికి తక్షణమే పంపబడతాయి. రైలు ఆ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు.. ఆర్పీఎఫ్ సిబ్బంది లేదా రైల్వే అధికారులు ఫిర్యాదుదారు పేర్కొన్న కోచ్‌ను తనిఖీ చేస్తారు. ఇంకా పోగొట్టుకున్న వస్తువు దొరికినట్లయితే.. దానిని లాస్ట్ ప్రాపర్టీ ఆఫీస్ (LPO) లో భద్రపరుస్తారు. ఆర్పీఎఫ్..రైల్వే అధికారులు ప్రయాణికుడిని సంప్రదించి.. సరైన గుర్తింపు, రుజువులు చూపించిన తర్వాత లగేజీని ఉచితంగా తిరిగి అప్పగిస్తారు. దొంగతనం జరిగినట్లయితే.. అది క్రిమినల్ కేసుగా  చెబుతారు. దొంగతనం కాకుండా కేవలం మరిచిపోయిన లగేజీని గుర్తించి.. అప్పగించడానికి రైల్వేలు ఎటువంటి రుసుము వసూలు చేయవు. ఈ ప్రక్రియ మొత్తం ప్రయాణికులకు సహాయం చేయాలనే లక్ష్యంతో.. ఉచితంగా నిర్వహించబడుతుంది. భారతీయ రైల్వేల ఈ సేవలు ప్రయాణికులకు భద్రత, భరోసాను ఇస్తున్నాయి. ఒకవేళ మీరు రైలులో ఏదైనా పోగొట్టుకున్నట్లయితే.. కంగారు పడకుండా వెంటనే రైల్ మదద్ ద్వారా లేదా ఆర్పీఎఫ్,స్టేషన్ మాస్టర్ ద్వారా ఫిర్యాదు చేసి మీ విలువైన వస్తువులను తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి:ఆ నెయ్యి తింటే చావు తప్పదు.. ఈ 6 షాకింగ్ విషయాలు మీ కోసమే!

Advertisment
తాజా కథనాలు