Sleep: నిద్ర కావాలా నాయన.. అయితే ఈ యోగాసనాల గురించి తెలుసుకోండి!!

ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Sleep

Sleep

నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యల వల్ల నిద్రలేమి (Insomnia), మనసు చంచలత్వం, ఆందోళన వంటి ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. ఈ సమస్యల నివారణకు యోగా ఒక సహజసిద్ధమైన, ప్రభావవంతమైన మార్గమని ఆయుష్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కొన్ని సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడికి పరిష్కారానికి భోజనం తర్వాత చేయాల్సిన ఆసనాల గురించి కొన్ని ఈ విషయాలు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

వజ్రాసనం (Vajrasana):

భోజనం తర్వాత చేయగలిగే ఏకైక ఆసనం వజ్రాసనం. భోజనం అనంతరం 5-10 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోవడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడితే.. నిద్రకు ఆటంకం కలిగించే అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. వజ్రాసనం పొట్టను ప్రశాంతపరుస్తుంది, మనసును శాంతపరుస్తుంది, వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది. మోకాళ్లపై కూర్చుని, కాలి వేళ్లు ఒకదానికొకటి తాకాలి. మడమలను మాత్రం వేరుగా ఉంచాలి. శరీరాన్ని నిటారుగా ఉంచి, కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

సుప్త తడాసనం (Supta Tadasana):

ఈ ఆసనం శరీరం, మనసు రెండింటినీ విశ్రాంతి పరుస్తుంది. ఇది వెన్నెముకను సాగదీసి, వెన్ను నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. కండరాల దృఢత్వం, ఆందోళన తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. వెల్లకిలా పడుకుని, కాళ్లను చాచి, చేతులను తల మీదుగా నేలకు సమాంతరంగా సాగదీయాలి. ఆరు సెకన్ల పాటు ఈ సాగింపును ఉంచి, నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవాలి. దీనిని 4-5 సార్లు పునరావృతం చేయాలి.

బద్ధ కోణాసనం (Baddha Konasana):

మనసును ప్రశాంతపరచడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఇది దిగువ వీపు (Lower back) ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మోకాళ్ళను మడిచి, పాదాల అరికాళ్లను ఒకదానికొకటి నొక్కాలి. నెమ్మదిగా మోకాళ్ళను నేల వైపు నొక్కాలి. చేతులను కడుపుపై ఉంచి.. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఈ సాగింపు ఆందోళనను తగ్గిస్తుంది. ఈ ఆసనాలను రోజూ సాధన చేయడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడి, పగటిపూట ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టెన్షన్ ఎందుకు దండగా.. ఆయుర్వేదం ఉండగా!!

Advertisment
తాజా కథనాలు