/rtv/media/media_files/2025/09/30/heart-attack-2025-09-30-13-22-53.jpg)
Heart Attack
గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చే సమస్య అని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి శరీరం దీనికి ముందుగానే అనేక హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలను తేలికగా తీసుకోవడం లేదా విస్మరించడం వల్ల పెద్ద సమస్యలకు దారితీస్తుందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా గుండెపోటును నివారించవచ్చని, సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు యొక్క అత్యంత ముఖ్యమైన సంకేతం ఛాతీలో నిరంతరంగా బరువుగా లేదా ఒత్తిడిగా అనిపించడం. ఈ నొప్పి తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ కొన్ని నిమిషాల పాటు ఉండే తేలికపాటి ఒత్తిడి రూపంలో కూడా ఉండవచ్చు. ఈ నొప్పి కొన్నిసార్లు భుజాలు.. చేతులు, మెడ, వెనుక భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఈ సమస్య పదేపదే ఎదురైతే వెంటనే అప్రమత్తం కావాలి.
గుండెపోటు ముందస్తు సంకేతాలు:
ఎలాంటి కారణం లేకుండా అలసట, బలహీనతగా అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా మహిళలు ఈ లక్షణాన్ని సాధారణ అలసటగా భావించి తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. నిరంతర అలసట గుండెకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కావచ్చు. గుండె లయలో తేడాల కారణంగా ఊపిరితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందక శ్వాస ఆడకపోవడం, ఆందోళన కూడా కలగవచ్చు. తేలికపాటి శ్రమతో కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు.
ఇది కూడా చదవండి: పండ్లు ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినొద్దు?
అలాగే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంటను చాలాసార్లు గ్యాస్ లేదా అజీర్ణంగా భావిస్తారు. మందులు తీసుకున్నా ఈ సమస్యలు తగ్గకపోతే.. అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు. గుండెపోటుకు ముందు రక్త ప్రసరణలో మార్పులు జరిగి అకస్మాత్తుగా చల్లని చెమటలు పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రమైన పరిస్థితిని సూచించే ప్రమాదకరమైన సంకేతాలు. ఈ లక్షణాలు నిలకడగా కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో ఈసీజీ , గుండె పరీక్షలు చేయించుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. సమతుల్య ఆహారం.. క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. శరీర హెచ్చరికలను విస్మరించకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: యవ్వనంగా కనిపించేందుకు ఇంటి చిట్కాలను ఫాలో అవుదాం.. అవేంటో తెలుసుకోండి!!