Health Tips: పండ్లు ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినొద్దు?

పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పండ్లను సరైన సమయంలో తినడం ఎంత ముఖ్యమో.. తప్పు సమయంలో తినకుండా ఉండటం కూడా అంతే అవసరం. పండ్లను తప్పుడు సమయంలో తింటే ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

New Update
fruits

fruits

పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో అత్యంత ముఖ్యమైన భాగం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే పండ్లను సరైన సమయంలో తినడం ఎంత ముఖ్యమో.. తప్పు సమయంలో తినకుండా ఉండటం కూడా అంతే అవసరం. పండ్లను తప్పుడు సమయంలో తింటే ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పండ్లను ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పండ్లు తినడానికి ఉత్తమ సమయం:

భోజనాల మధ్య విరామం: పండ్లను ఎల్లప్పుడూ రెండు భోజనాల మధ్య విరామ సమయాల్లో (Snacks) తినడం ఉత్తమం. ఈ సమయంలో మన కడుపు తేలికగా ఉంటుంది. తద్వారా జీర్ణవ్యవస్థ పండ్లలోని పోషకాలను మెరుగ్గా గ్రహించగలుగుతుంది.

వ్యాయామానికి ముందు: వ్యాయామం (Workout) చేయడానికి 30 నుంచి 40 నిమిషాల ముందు అరటిపండ్లు లేదా యాపిల్స్ వంటి పండ్లను తీసుకోవడం మంచిది. ఇది శరీరానికి శక్తిని అందించి అలసట రాకుండా చూస్తుంది.

డెజర్ట్‌కు బదులుగా: భోజనం తర్వాత తీపి తినాలనే కోరిక కలిగితే.. డెజర్ట్‌కు బదులుగా కొద్ది మొత్తంలో పండ్లను తింటే రుచి కోరిక తీరడంతోపాటు ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది.

పండ్లను తినకూడని సమయం..

ఖాళీ కడుపుతో: ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో పండ్లను తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చక్కెర మరియు ఇన్సులిన్ స్థాయులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియా (Gut Bacteria) సమతుల్యతను దెబ్బతీస్తుంది.

రాత్రి భోజనం తరువాత: రాత్రి ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం కూడా మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించి, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పండ్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వాటిని సరైన సమయంలో ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: యవ్వనంగా కనిపించేందుకు ఇంటి చిట్కాలను ఫాలో అవుదాం.. అవేంటో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు