/rtv/media/media_files/2025/08/15/trump-and-putin-2025-08-15-18-11-08.jpg)
Trump and Putin
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పుతిన్‌తో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఇరుదేశాధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు పుతిన్ అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం ముగించేందుకు పుతిన్ నిరాకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ రష్యాతో చర్చలు విఫలమైతే మరింత టారిఫ్స్ పెంచుతామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై కూడా మరిన్ని సుంకాలు విధించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య భూభాగం విషయంలోనే చర్చలు జరుగుతాయని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.
Also Read: చైనాలో మామూలుగా లేదు.. రోబోలతోనే ఒలింపిక్ గేమ్స్..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య కాల్పులు ఆగడం లేదు. అయితే ఈ భేటీ అత్యంత కీలకం కానుంది. అయితే ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరుదేశాల మధ్య భూభాగాల మార్పిడి జరగవచ్చని ఇటీవలే ట్రంప్ చెప్పారు. కానీ ఏయే భూభాగాలపై మార్పిడి ఉంటుందనేదానిపై వివరాలు వెల్లడించలేదు. రష్యా.. ఉక్రెయిన్ నుంచి భూభాగాన్ని ఆక్రమించిందని, అందులో కొంతభాగాన్ని ఉక్రెయిన్‌కు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని ట్రంప్ తెలిపారు.
మరి ఇందుకు రష్యా ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఉక్రెయిన్ కూడా కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తుందని కూడా సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం తమ భూభాగానికి సంబంధించిన విషయంలో రాజీపడేదే లేదని ఇటీవలే తేల్చిచెప్పారు. అయితే ట్రంప్, ఫుతిన్ భేటీలో చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అనేది ఆసక్తిగా మారింది. ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం జరగాలని ట్రంప్ కోరకుంటున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఆయన క్లియర్‌గా ఉన్నారని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇప్పటికే చాలాసార్లు సూచనలు చేశాయి. ప్రస్తుత పరిణామంలో ఇరుదేశాల మధ్య యుద్ధం ఆగుతుందా? లేదా ? అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచిచూడాల్సిందే.
Also Read: స్వాతంత్ర్య వేడుకలకు అడ్డొచ్చిన ఖలిస్థానీయులు.. భారతీయులతో గొడవ
ట్రంప్ బృందంలో
ఈ సమావేశంలో ట్రంప్ టీమ్‌లో మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్డన్ వంటి ముఖ్య సలహాదారులు, మైక్ పాండియా వంటి విదేశాంగ అధికారులు, అనువాదకులు ఉండనున్నట్లు సమాచారం.
పుతిన్ బృందంలో
ఇక పుతిన్ టీమ్‌లో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వంటి ఉన్నత స్థాయి అధికారులు, విదేశీ వ్యవహారాల సలహాదారు యూరీ ఉషాకోవ్ వంటి ముఖ్య సలహాదారులు, అనువాదకులు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో.. కేవలం ఇద్దరు నేతలు, తమ అనువాదకులు మాత్రమే ఏకాంతంగా మీటింగ్ అవుతుంటారు.
Also Read: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..