/rtv/media/media_files/2025/07/29/israel-hamas-war-2025-07-29-20-03-37.jpg)
Over 60,000 Palestinians killed in the 21 month Israel-Hamas war, Says Gaza’s Health Ministry
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దీంతో అక్కడ తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తిండి లేక ఆకలి కేకలతో స్థానికులు చనిపోవడం కలకలం రేపుతోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. గత 21 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం సాగుతోంది. ఈ దాడుల్లో గాజాలోని ఇప్పటిదాకా 60 వేల మందికి పైగా మృతి చెందారు. మరో 1.45 లక్షల మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read : ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు.. 22 మంది మృతి
Israel-Hamas War
మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని చెప్పింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 113 మంది మృతి చెందారని.. మరో 673 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొంది. చనిపోయిన వారిలో సామాన్య పౌరులు ఎందరు, యుద్ధంలో పాల్గొన్న వారు ఎందరు అనేదానిపై మాత్రం గాజా ఆరోగ్యశాఖ క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలాఉండగా ప్రస్తుతం గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ఆహారం కోసం అక్కడి ప్రజలు అలమటిస్తున్నారు. స్థానికకంగా అక్కడ కరవు పరిస్థితి ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సహకారంతో రూపొందించిన IPC నివేదిక అంచనా వేసింది. లేకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది.
''మే నుంచి జులై మధ్యకాలంలో చూసుకుంటే తిండి లేని కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగింది. గాజా పట్టణంలో మే నెలలో పోషకాహార లోపం రేటు 4.4 శాతంగా ఉండేది. జులైలో ఏకంగా 16.5 శాతానికి పెరిగింది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల్లో ఐదింట రెండొంతుల మంది జూన్ నెలలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడ్డారని వెల్లడించింది. ప్రస్తుతం గాజా వాసులు తిండి కోసం మానవతా సహాయ కేంద్రాల వద్ద ఎగడబడుతున్నారు. అక్కడ కూడా ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసింది.
Also Read : పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టించిన చైనా డివైస్.. ఆ 45 నిమిషాలు ఏం జరిగింది?
ప్రస్తుతం గాజాపై నిరంతరాయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో ప్రపంచ దేశాల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఆంక్షలను కాస్త సడలించింది. అయినా కూడా అక్కడ పరిస్థితులు మారడం లేదని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు చెబుతున్నారు. గాజాలో ఎన్ని మానవతా సహాయ ట్రక్కులు ప్రవేశించాలనే దానిపై ఎలాంటి పరిమితి లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ అక్కడ నెలకొన్న దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు ఏ మాత్రం సరిపోవని ఐరాస, సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు ఫలించడం లేదు. ఇప్పటికే ఈ ఒప్పందం చేసుకునేది లేదని హమాస్ తేల్చిచెప్పింది. దీంతో ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది.
israel gaza war | rtv-news | Israel Hamas War | latest-telugu-news | telugu-news | international news in telugu