/rtv/media/media_files/2025/10/11/trump-2025-10-11-15-43-11.jpg)
India sides with Taliban, Pakistan, China, slams Trump bid to take over Bagram base
అఫ్గానిస్థాన్(afghanistan)లోని బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని తాలిబన్లు, పాకిస్థాన్, చైనా, రష్యా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భారత్ కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశాల సరసన చేరింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్ పర్యటనకు ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మాస్కోలోని అఫ్గానిస్థాన్‌కు సంబంధించి ఏడవ మాస్కో ఫార్మట్ సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అఫ్గాన్, భారత్, ఇరాన్, ఖజకిస్థాన్, చైనా, కిర్గిస్థాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రత్యేక ప్రతినిధులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
గత నెలలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. '' అమెరికా ప్రభుత్వం బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. మేము దీన్ని తాలిబాన్లకు ఉచితంగానే వదిలేశాం. ఆ ఎయిర్ బేస్ మాకు కావాలని'' అన్నారు. ఇలా చెప్పిన రెండ్రోజుల తర్వాత ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో మరో సంచలన పోస్టు చేశారు. అఫ్గానిస్థాన్ బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను వెనక్కి ఇవ్వకుంటే దుర్భర పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాలిబాన్లు మాత్రం ట్రంప్ హెచ్చరికలను పట్టించుకులేదు. తాబిబాన్ ప్రధాన ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. అఫ్గానిస్థానీయులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ భూభాగాన్ని అప్పగించేందుకు అంగీకరించరని స్పష్టం చేశారు.
అఫ్గాన్‌కే మా సపోర్ట్
అఫ్గాన్‌కు సపోర్ట్‌గా పాకిస్థాన్, చైనా, రష్యా ఉన్నాయి. ఇప్పుడు ఆశ్చర్యంగా భారత్ కూడా అఫ్గాన్ విషయంలో ట్రంప్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది. భారత్‌కు అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ మొదటిసారి ఇండియా పర్యటనకు రానున్న ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే భారత ప్రజలు ట్రంప్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ అఫ్గాన్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ట్రంప్ చాలా చిన్నోడు.. వయస్సు తప్పు.. వైట్ హౌస్ డాక్టర్ల షాకింగ్ రిపోర్ట్!
అఫ్గాన్ ఆ చర్యలు తీసుకోవాలి
ఇటీవల మాస్కోలో జరిగిన సమావేశంలో పాల్గొన్న దేశాలు అఫ్గానిస్థాన్‌ను స్వతంత్ర్య, ఐక్యమతమైన, శాంతియుత దేశంగా ఏర్పాటు చేసేందుకు మద్దతిచ్చాయి. అఫ్గానిస్థాన్ ద్వైపాక్షిక, బహుపాక్షిక స్థాయిల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకరించాలని పిలుపునిచ్చాయి. అంతేకాదు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అఫ్గాన్ సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పాయి. దీనివల్ల అఫ్గాన్ అంటే పొరుగు దేశాలు కూడా భద్రతా పరంగా ఎలాంటి ముప్పు ఉండదని భావిస్తాయని పేర్కొన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ దేశాలతో అఫ్గానిస్థాన్‌లో ఆర్థిక, వ్యాపార సంబంధాలు అభివృద్ధి చేయడం, పెట్టుబడులు పెట్టడం అవసరమని గుర్తించాయి. అలాగే ఆరోగ్య, పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగాల్లో పురోగతి సాధించేలా అఫ్గాన్‌తో కలిసి ప్రాంతీయ ఆర్థిక ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపించాయి.
బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎవరు స్థాపించారు ?
ఇదిలాఉండగా అఫ్గానిస్థాన్‌లో బాగ్రామ్ ఎయిర్‌బేస్ అనేది పర్వాన్ ప్రావిన్స్‌లో ఉత్తర కాబుల్‌కు 60 కి.మీ దూరంలో ఉంది. ఈ ఎయిర్‌బేస్‌ను 1950లో సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసింది. అయితే 1979-89 మధ్య సోవియట్-అఫ్గానిస్థాన్ యుద్ధం జరిగినప్పడు బాగ్రామ్ ఎయిర్‌బేస్ సోవియట్‌కు కీలక ప్రదేశంగా మారింది. చివరికి1990లో సోవియట్ యూనియన్ ఇక్కడి నుంచి వెళ్లిపోయన అనంతరం బాగ్రామ్ ఎయిర్‌బేస్ తాలిబన్, నార్తర్న్ అలియన్స్ ఫైటర్స్ యుద్ధం మధ్య ఫ్రంట్‌లైన్‌గా మారింది. 2001, సెప్టెంబర్ 11 తర్వాత అమెరికా, దాని మిత్రపక్షాలు తాలిబన్ పాలనను పడగొట్టి అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా బలగాలు అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకొని ఉన్నాయి.
అయితే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ప్రభుత్వం 2020లో తాలిబన్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. దీని ఫలితంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత అఫ్గాన్‌లో అమెరికాతో పాటు నాటో బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అనంతరం 2021లో తాలిబన్లు అఫ్గాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. చివరికి బాగ్రామ్ ఎయిర్‌బేస్ కూడా వాళ్ల చేతుల్లోకే వెళ్లిపోయింది. ప్రస్తుతం బాగ్రామ్ ఎయిర్‌బేస్ తాలిబాన్ నియంత్రణలోనే ఉంది.
Also Read: నా గౌరవం కోసమే తీసుకున్నారు...నోబెల్ బహుమతిపై మాట్లాడిన ట్రంప్
అయితే చైనా అఫ్గానిస్థాన్‌కు రోడ్ వేసే పనిలో నిమగ్నమైంది. దీంతో అమెరికా ఆందోళన చెందుతోంది. ట్రంప్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా న్యూక్లియర్ ఆయుధాలు తయారుచేసే ప్రాంతం నుంచి బాగ్రామ్ ఎయిర్‌బేస్‌కు కేవలం గంట ప్రయాణ దూరంలో ఉందని తెలిపారు. బైడెన్ ప్రభుత్వం బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను వదలుకుందని తీవ్రంగా విమర్శించారు. అయితే ట్రంప్ చైనాకి సంబంధించి ఏ న్యూక్లియర్ స్థావరాన్ని ప్రస్తావించారనే విషయంపై స్పష్టత లేదు. తాలిబన్లు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ తమ నియంత్రణలోనే ఉందని చెప్పారు. అలాగే చైనా బలగాలు కూడా ఇక్కడ లేవని.. ఆ దేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
Follow Us