/rtv/media/media_files/2025/11/27/guinea-bissau-2025-11-27-11-12-28.jpg)
పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశమైన గినియా-బిస్సావు(Guinea Bissau)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మధ్యాహ్నం రాజధాని బిస్సావులో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అధ్యక్ష భవనం చూట్టు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే సైన్యం మొత్తం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. దాంతో పాటూ ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రక్రియలను నిలిపివేసింది. దాంతో దేశానికి ఉన్న అన్ని అంతర్జాతీయ సరిహద్దులను మూసి వేశారు.
దీంతో బిస్సావు మొత్తంలో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో సైన్యం(army) తన దళాలను మోహరించింది. వీధుల్లో పెద్ద పెద్దబారికేడ్లను నిర్మించారు. చాలా మంది బిస్సావు నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష భవనం చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతం సైనిక ముట్టడిలో ఉందని, పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని జర్నలిస్టులు చెబుతున్నారు. దీంతో పాటూ ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ సాసోకోఎంబాలో కూడా కనిపించడం లేదు. ఇది మరింత ఆందోళనకరంగా మారింది.
Also Read : వైట్‌హౌస్ వద్ద కాల్పులు.. అమెరికా సంచలన నిర్ణయం
ఎన్నికలకు ముందు నుంచే...
సైన్యం తిరుగుబాటుకు మూడు రోజుల ముందే గినియా-బిస్సావు దేశ అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈరోజు ప్రకటించాల్సి ఉంది. కానీ ఈలోపు సైన్యం దేశాన్ని తన అదుపులోకి తీసుకుంది. మరోవైపు అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ వేర్వేరు విజయాలను ప్రకటించాయి. ఇది 2019 ఎన్నికలలో కనిపించే పరిస్థితిని ప్రతిబింబిస్తుంది, అక్కడ ఫలితాలు నెలల తరబడి వివాదాస్పదంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండే వివాదంలో చిక్కుకుంది. ప్రధాన ప్రతిపక్షపార్టీఅయినPAIGC ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దీనిని ప్రతిపక్షాలు రాజకీయ ఒత్తిడిగా అభివర్ణించాయి. అధ్యక్షుడు ఎంబాలో పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. కానీ ఆయన పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించారు. దీంతో అక్కడ రాజకీయాలు చాలా రోజుల నుంచీ గందరగోళంగా మారాయి.
Also Read : హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44 చేరుకున్న మృతుల సంఖ్య
ఇదేమీ మొదటిసారి కాదు..
ఇక గినియా-బిస్సావులో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. 1974లో ఆ దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అనేక రాజకీయ తిరుగుబాట్లను చవిచూసింది. ఇందులో నాలుగు తిరుగుబాట్లు విజయవంతం అయ్యాయి కూడా. అవినీతి, పేదరికం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అస్థిరతకు ఈ దేశ పరిస్థితులు ఆజ్యం పోస్తున్నాయి.
Follow Us