Crude Oil: భగ్గుమంటున్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది.

New Update
Crude oil prices spike amid US-Iran war

Crude oil prices spike amid US-Iran war

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన యుద్ధం రెండో వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు(crude-oil-prices) ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్కును దాటేసింది. గత మూడున్నరేళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.

Also Read :  కొత్త సుప్రీం లీడర్‌ని ప్రకటించిన ఇరాన్.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్

రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

ముడిచమురు ధరల్లో అకస్మాత్తుగా భారీ పెరుగుదల(Crude Oil Prices Spike) కనిపిస్తోంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ధరలు కొంత నిలకడగా ఉన్నప్పటికీ, ఆదివారం నాటికి ట్రేడింగ్‌లో పరిస్థితి తలకిందులైంది.
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI): అమెరికా చమురు ధరలకు బెంచ్‌మార్క్‌గా ఉన్న WTI ధర ఏకంగా 106.22 డాలర్లకు చేరుకుంది. గత సెషన్ ముగింపు ధర (90.90 డాలర్లు) తో పోలిస్తే ఇది 16.9 శాతం పెరుగుదల.

బ్రెంట్ క్రూడ్: అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర 16.5 శాతం పెరిగి 107.97 డాలర్లకు ఎగబాకింది. కేవలం గత ఒక్క వారంలోనే అమెరికా క్రూడ్ ధర 36 శాతం, బ్రెంట్ క్రూడ్ 26 శాతం పెరగడం గమనార్హం.

హర్మూజ్ జలసంధి దిగ్బంధం - అసలు ముప్పు ఇదే!

చమురు ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం హర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే. ప్రపంచ ఇంధన అవసరాలకు ఈ జలసంధి ఒక జీవనాడి వంటిది. ప్రపంచం వినియోగించే మొత్తం చమురులో దాదాపు ఐదో వంతు (20%) ఈ సన్నని జలమార్గం నుంచే రవాణా అవుతుంది.

ఇటీవల ఇరాన్ చేసిన హెచ్చరికలు మార్కెట్లను భయపెడుతున్నాయి. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నామని, ఎవరైనా నౌకలను నడపాలని ప్రయత్నిస్తే వాటిని తగులబెడతామని ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా దళాలు ఇరాన్‌పై జరిపిన దాడుల అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Also Read :  ఇరాన్ సుప్రీం లీడర్ ఖరారు.. పేరు రహస్యంగా ఉంచిన అసెంబ్లీ.. ఉత్కంఠలో ప్రపంచ దేశాలు!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి మరియు షిప్పింగ్‌కు ఆటంకం ఏర్పడటంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింటోంది. ఒకవేళ యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే, చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుండి 150 డాలర్ల వరకు వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి, సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ భారాన్ని మోపే ప్రమాదం ఉంది.

Advertisment
తాజా కథనాలు