/rtv/media/media_files/2026/03/08/iran-new-supreme-leader-2026-03-08-18-42-01.jpg)
ఇరాన్ రాజకీయాల్లో అత్యున్నత పీఠంపై కూర్చోబోయే వ్యక్తి ఎవరనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన తర్వాత సుప్రీం లీడర్ ఎంపిక చేసే 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' (మత గురువుల మండలి) ఆదివారం ఓ కీలక ప్రకటన చేసింది. దేశ తదుపరి సుప్రీం లీడర్‌ను మెజారిటీ ఓట్లతో ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి పేరును ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు.
🚨 BREAKING
— Miracle_Of_God🇺🇸🇳🇬 (@Baddo360) March 8, 2026
Iranian state media reports that a new Supreme Leader has been chosen, but the identity has not yet been publicly announced.
(Are they scared to identify him?) pic.twitter.com/mqMYVCU9Kp
ఎంపిక ప్రక్రియ పూర్తి - రహస్యంగా పేరు
మత గురువుల మండలి సభ్యుడు అహ్మద్ అలమోల్హోడా మీడియాతో మాట్లాడుతూ, "కొత్త నాయకుడిని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అత్యంత తగిన అభ్యర్థిని మెజారిటీ సభ్యులు ఎంపిక చేశారు" అని తెలిపారు. మండలి సెక్రటేరియట్ సరైన సమయంలో ఈ పేరును అధికారికంగా వెల్లడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నందున, కొత్త నాయకుడి భద్రత దృష్ట్యా ఈ గోప్యత పాటిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వారసుడిగా ఖమేనీ కుమారుడు 'మోజ్తబా'?
అధికారికంగా పేరు బయటకు రాకపోయినప్పటికీ, అలీ ఖమేనీ రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీ (56) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం 'రెవల్యూషనరీ గార్డ్స్' (IRGC) పూర్తి మద్దతు ఉన్నట్లు సమాచారం. అయితే, వారసత్వ రాజకీయాలను కొందరు మత గురువులు వ్యతిరేకిస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మోజ్తబా ఎంపికను తోసిపుచ్చుతూ, ఆయన ఒక "లైట్ వెయిట్" (బలం లేని) నాయకుడని వ్యాఖ్యానించారు. మోజ్తబాతో పాటు అలిరెజా అరాఫీ వంటి ఇతర సీనియర్ మత పెద్దల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఇజ్రాయెల్ వార్నింగ్
మరోవైపు, ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకున్న తరుణంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టే వ్యక్తిని కూడా తమ దాడులకు లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ ప్రస్తుతం 40 రోజుల సంతాప దినాలను పాటిస్తోంది. దేశంలో ఒకవైపు ప్రభుత్వం పట్ల నిరసనలు, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో, కొత్త సుప్రీం లీడర్ దేశాన్ని ఏ దిశగా నడిపిస్తారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Follow Us