/rtv/media/media_files/2025/12/26/bangladesh-2025-12-26-16-30-49.jpg)
Bangladesh belongs to Muslims, Hindus, Christians, Tarique Rehman's peace appeal
బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మైనార్టీలపై దాడులు జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్ రెహమాన్(Tarique Rehman) బంగ్లాదేశ్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు. తారిఖ్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగ్లాదేశ్ అన్ని మతాలు, విశ్వాసాలకు చెందినదని ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2008లో బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోయిన తారిఖ్ రెహమాన్ అప్పటినుంచి లండన్‌లోనే ఉంటున్నారు. 17 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి తాజాగా స్వదేశానికి వచ్చారు. గురువారం ఢాకాలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా జులై 36 ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతానికి చేరుకున్నారు. బీఎన్‌పీ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అందరం కలిసి నిర్మించుకోవాల్సినం సమయం వచ్చిందని అన్నారు. ఈ దేశం కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్నవారికి, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు చెందినదని వ్యాఖ్యానించారు. ప్రతి మహిళ, పురుషుడు, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ క్షేమంగా ఇంటికి చేరుకునే సురక్షిత బంగ్లాదేశ్‌గా నిర్మించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మైనార్టీలో దాడులు జరుగుతన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. షేక్ హసీనా స్థానం నుంచి హిందూ అభ్యర్థి పోటీ
Tarique Rehman's Peace Appeal
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే యూనస్ పాలనలో మైనార్టీలే లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇటీవల మైనార్టీ గ్రూప్ సభ్యులు ఢాకాలో నిరసనలు చేశారు. తమకు దేశంలో భద్రత లేదని, మమ్మల్ని రక్షించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భారత్ కూడా బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలాంటి పరిస్థితులను వ్యతిరేకిస్తూ తారిఖ్ రెహమాన్ తన గళాన్ని వినిపించారు. దేశంలో స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం ఏ పార్టీకి చెందినవారమైనా, ఏ మతాన్ని పాటిస్తున్న వాళ్లమైనా అందరూ కలిసి శాంతి భద్రతలు కాపాడుకునేందుకు చేతులు కలపాలని కోరారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హదీ హత్య కేసు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత దేశంలో అస్థిరత నెలకొంది. ఇలాంటి సమయంలో స్వదేశానికి రెహమాన్ రాక చర్చనీయాంశమవుతోంది. మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షుడి దంపతుల కుమారుడైన రెహమాన్.. బంగ్లాదేశ్ ప్రధాని రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తనవద్ద ఓ ప్రణాళిక కూడా ఉన్నట్లు రెహమాన్ తెలిపారు. ఈ ప్లాన్‌ను అమలు చేయాలంటే దేశ ప్రజలందరీ మద్ధతు తనకు అవసరమని చెప్పారు.
Also Read: పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రసంస్థ..త్వరలో వైమానిక దళం ఏర్పాటు..
Follow Us