/rtv/media/media_files/2025/09/26/yvs-chowdary-2025-09-26-09-31-00.jpg)
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి(director-yvs-chowdary) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ మేరకు ఆయన నోట్ విడుదల చేశారు.
మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు. కానీ.. ఒక లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుండీ దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు.. అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అంటూ తన పోస్టులో వెల్లడించారు.
Also Read : ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే
లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో
ఇక వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విజయం తరువాత అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ కథానాయకులుగా సీతారామరాజు, మహేష్ బాబు కథానాయకుడిగా యువరాజు సినిమాలను తెరకెక్కించారు. తరువాత బొమ్మరిల్లు వారి నిర్మాణ సంస్థను స్థాపించి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో నిర్మాతగా మారాడు. దాని తరువాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో సలీమ్ మినహా మిగతా సినిమాలన్నింటినీ తానే నిర్మించారు. చౌదరి ఇప్పటివరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు. హరికృష్ణ మనవడితో ఇప్పుడు సినిమా తీస్తున్నారు చౌదరి.
Also Read : సింగర్ జుబీన్ గార్గ్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్.. స్టార్ మ్యుజీషియన్ అరెస్ట్!