TG News: ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. నిర్మల్ జిల్లాలో ఓ ఆర్డరు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని పోలీసులు అరెస్టు చేశారు.
ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. నిర్మల్రూరల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్లో ఉంటున్న ఓ గృహిణి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఓ వస్తువు ఆర్డర్ చేసింది. ఆ వస్తువును మంగళవారం ఓ డెలివరీ బాయ్ తీసుకుని వచ్చాడు. ఉదయం గృహిణి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఒంటరిగా ఉందని గ్రహించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు చుట్టుపక్కల వారి ఇంటికి వచ్చారు. ఈ లోపే డెలివరీ బాయ్ భయపడి పారిపోయాడు. వెంటనే గృహిణి, స్థానికులు, కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పీఎస్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎస్సై సాయికుమార్ నిందితున్ని వెతికి పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈ కామర్స్ డెలివరీ బాయ్ ఎవరు వచ్చినా ఇంటి లోపలికి అనుమతించొద్దన్నారు. గేటు బయట ఆపి పార్సిల్ తీసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు ఇంటికి వస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని రూరల్ ఎస్సై సాయికుమార్ తెలిపారు.