కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి మహిళకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ముఖ్యమంత్రి జగన్ ను అభినందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడేది తక్కువ.. పని చేసేది ఎక్కువ అని రోజా కొనియాడారు.
బుధవారం నగరి మండలంలో వైస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా టేక్ హోమ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రకాల పోషక ఆహారాల కిట్స్ ను గర్భిణీ స్త్రీలు, బేబీ మదర్స్ కు అందించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. గర్భవతి, బాలింతల సౌకర్యార్థం ఇంటింటికే పోషకాహార కిట్స్ పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి రోజా.
సీఎం జగన్ చాలా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఇంటింటికి బాలింతలకు పోషకాహారి ఇస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారానే ఇవన్నీ ఇవ్వగలమన్న విషయం పవన్ కళ్యాణ్ తెలిసుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కు చెడు ఆలోచనలే ఉన్నాయని, చెడు ఆలోచనలు ఉన్నవారికి అన్నీ చెడు బుద్ధులే ఉంటాయని రోజా ధ్వజమెత్తారు.
గత టీడీపీ పాలనలో రక్త హీనతతో గర్భిణీలు చనిపోయారని అన్నారు. జన్మభూమి కమిటీ పేరుతో కోడిగుడ్లు, బియ్యం, పప్పు తినేశారని దుయ్యబట్టారు మంత్రి రోజా. మాజీ మంత్రి నారాయణ తమ్ముడు భార్య కృష్ణ ప్రియ వీడియోలు పెట్టింది.. పవన్ అభిమాని అని చెప్పింది.. నాకు న్యాయం చేయాలని అడిగింది.. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఎన్నికలకు ఇచ్చే ఫండ్, ఫ్యాకేజీ స్టార్ కు ఇచ్చే ఫండ్ తీసుకుని నోటికి ప్లాస్టర్ వేసుకున్నావా? అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని షూటింగ్ గ్యాప్ లో వచ్చి ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకుని.. ఆ వాహనంపైనే చెప్పులు వేసుకుని తప్పుడు కూతలు కూస్తే రాష్ట్ర మహిళలు ఊరుకునే పరిస్థితి లేదని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.