Crime news: ప్రియుడితో భర్తను చంపించి..రోడ్డుప్రమాదంగా చిత్రీకరించింది..చివరికి ఏమయిందంటే?

ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది. గుంటూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

New Update
The wife killed her husband

The wife killed her husband

Crime news: ప్రేమలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యలు మరీ క్రూరంగా తయారవుతున్నారు. మూడుముళ్లు, ఏడడుగుల బంధాన్ని కాదని కట్టుకున్నవాడిని కాటికి పంపుతున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆస్తి కోసం ప్రియుడితో భర్తను హత్య చేయించిందో మహిళ. హత్య అని అనుమానం రాకుండా ఉండేందుకు  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అది హత్యగా తేలడంతో కటకటాలపాలయింది.

గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్‌ మండలం పెదపలకలూరుకు చెందిన ఆటో డ్రైవర్‌ చెన్నంశెట్టి గోవిందరాజు(40)కు  సత్తెనపల్లికి చెందిన లక్ష్మితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే గోవిందరాజు రోజు మద్యం సేవిస్తుండటంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరేళ్లుగా సత్తెనపల్లిలో భర్తను వదిలేసి విడిగా ఉంటోంది. ఈ క్రమంలోనే క్యాటరింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న లక్ష్మీకి  పెర్నేటి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకట్‌తో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. మూడేళ్లుగా అతనితో సన్నిహితంగా ఉంటోంది. ఇదిలా ఉండగా భర్తకు రూ.కోటిన్నర విలువై చేసే ఇళ్లు, స్థలాలు ఉండటంతో వాటిని ఎలాగైన దక్కించుకోవాలనుకుంది. భర్తను హత్య చేస్తే ఆస్తి తనకే వస్తుందని, అప్పుడు విలాసవంతమైన జీవితం గడపొచ్చని వెంకట్‌కు చెప్పి హత్యకు ఒప్పించింది.

ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం  వెంకట్‌ తన స్నేహితుడు షేక్‌ ఖాసింసైదాతో గోవిందరాజు హత్యకు కుట్రపన్నారు. సెప్టెంబరు 18న గోవిందరాజును తీసుకెళ్లి ఫుల్‌గా మద్యం తాగించారు. అనంతరం అక్కడి నుంచి సాతులూరు పెదరెడ్డిపాలెం సమీపానికి తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అనంతరం మొలతాడు తెంచి మెడకు బిగించారు. దీంతో గోవిందరాజ స్పృహ తప్పిపడిపోయాడు. ఈలోపు లక్ష్మి నిందితులకు ఫోన్‌ చేసి హత్య చేసినట్లు తెలియకూడదని రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించాలని సూచించింది. దీంతో గోవిందరాజును ఆటోలో ఎక్కించుకొని సత్తెనపల్లి మండలం అబ్బూరులో రోడ్డు పక్కన పడేశారు. అయితే అతను చనిపోలేదని గుర్తించి ఇనుప రాడ్డును గొంతుపై పెట్టి గట్టిగా నొక్కి హత్య చేశారు. 

చనిపోయిన గోవిందరాజు మృతదేహాన్ని పేరేచర్ల-పలకలూరు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. మరునాడు సెప్టెంబరు 19న స్థానికులు అతని మృతదుహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం  అందించారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. ప్రాథమికంగా రోడ్డు ప్రమాదంగా భావించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మృతుని ఫొటోను తెప్పించుకొని చూడగా మృతుడి నాలుక బయటపెట్టి ఉంది. దీంతో అనుమానం వచ్చిన ఆయన లక్ష్మిపై నిఘా పెట్టారు.  విచారణలో లక్ష్మికి వెంకట్ తో ఉన్న ఎఫైర్ వెలుగు చూసింది. ఆ కోణంలో విచారించిన పోలీసులకు  అసలు విషయం బయటపడింది. ఆస్తికోసం తానే భర్తను హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

Advertisment
తాజా కథనాలు