Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం.. అది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన జ్వరం. ఈ వ్యాధి సోకిన లార్వల్ మైట్స్ కరవడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. సాధారణ జ్వరం, జలుబు, వణుకు నల్లని మచ్చ, దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

New Update
Scrub Typhus fever

Scrub Typhus fever

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసుల సంఖ్య ప్రజారోగ్య అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం సాధారణ జ్వరం కాదని.. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్లేట్‌లెట్స్ తగ్గడం, మెదడు, శ్వాసకోశ సంబంధిత తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదకరమైన బ్యాక్టీరియా సంక్రమణ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఈ బ్యాక్టీరియా చిగ్గర్స్ అని పిలువబడే, నల్లి (మైట్) తరహాలో ఉండే అతి చిన్న పురుగుల లార్వాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ పురుగులు (చిగ్గర్స్) సాధారణంగా పొదలు, గడ్డి, అటవీ ప్రాంతాలు, తోటలు, చెత్తాచెదారం ఉన్న ప్రదేశాలలో కనిపిస్తాయి. పొలాల్లో పనిచేసేవారు.. తోటల పెంపకందారులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

 దద్దుర్లు, తీవ్రమైన జ్వరం:

ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు సాధారణంగా కీటకం కుట్టిన 6 నుంచి 21 రోజులలోపు (సగటున 10-12 రోజులు) కనిపిస్తాయి. అయితే సరైన సమయంలో గుర్తించకపోతే.. తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్‌కు చికిత్స అందించడంలో ఆలస్యం ప్రాణాంతకం కావచ్చని అంటున్నారు. జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభిస్తే.. స్క్రబ్ టైఫస్ మరణాల రేటు 2% కన్నా తక్కువగా ఉంటుంది. చికిత్స ఆలస్యం అయినప్పుడు మరణాల శాతం 6% నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధికి యాంటీ బయాటిక్స్ ప్రధాన చికిత్స. ముఖ్యంగా డాక్సీసైక్లిన్ (Doxycycline) ను అన్ని వయసుల వారికి సిఫార్సు చేస్తారు. చికిత్స ప్రారంభించిన 24 నుంచి 48 గంటలలోపు రోగులు కోలుకోవడం మొదలవుతుంది. అయితే.. వ్యాధి మళ్లీ రాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్ కోర్సును పూర్తిగా తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలలో అజిత్రోమైసిన్ (Azithromycin)ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.

ఏపీలో ఆందోళనకరం:

రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు (379), కాకినాడ (141), విశాఖపట్నం (123) జిల్లాల్లో కేసుల సంఖ్య అధికంగా నమోదైంది. చాలామంది డాక్టర్లు జ్వరం వచ్చినప్పుడు మొదట డెంగీ, మలేరియా పరీక్షలు చేయించి, జ్వరం తగ్గకపోతేనే స్క్రబ్ టైఫస్ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయానికి కేసులు గుర్తించడం కష్టమవుతోంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

స్క్రబ్ టైఫస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.. కానీ కీటకం కుట్టకుండా జాగ్రత్త పడటం ఒక్కటే నివారణ మార్గం. పొదలు, తోటలు, వ్యవసాయ క్షేత్రాలు లేదా తడి నేల ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు చేతులు, కాళ్లు పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి. చర్మంపై, బట్టలపై DEET లేదా పర్మెత్రిన్ (Permethrin) ఆధారిత కీటక వికర్షకాలను ఉపయోగించడం. పర్మెత్రిన్‌ను నేరుగా చర్మంపై కాకుండా దుస్తులపై మాత్రమే ఉపయోగించాలి. ఇంటి పరిసరాలలో గడ్డి పెరగకుండా.. చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి. పాతబడిన దుప్పట్లు, బొంతలు, పరుపులు శుభ్రంగా, ఎండ తగిలేలా ఉంచాలి.

ఇది కూడా చదవండి: గుండెపోటు గుట్టు మన ఉమ్మిలో దాగి ఉందని తెలుసా..? అది ఎలానో మీరూ తెలుసుకోండి!!

సాధారణ జ్వరం, జలుబు, వణుకు వంటి లక్షణాలతోపాటుగా శరీరంపై నల్లని మచ్చ (ఎస్కార్) లేదా దద్దుర్లు గమనించినట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో సరైన యాంటీ బయాటిక్స్‌తో చికిత్స తీసుకుంటే.. ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి సురక్షితంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: స్మార్ట్ ఫోన్ వాడకం, యువతో గుండెపోటుకు లింక్ ఏంటి..?

Advertisment
తాజా కథనాలు