/rtv/media/media_files/2025/05/02/QHFTVBzUum17hE4FDzJC.jpg)
Foundation stone laid for Amaravati
Amaravati Relaunch : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మైలురాయి నేడు ఆవిష్కృతమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని అంటూ లేకుండా పోయింది. తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి సంకల్పించినప్పటికీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల పేరుతో అమరాతి నిర్మాణాన్ని వదిలేసింది. మొన్నటి ఎన్నికల్లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాజధాని పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం కూడా ఏపీ కి కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉండటం కూడా కలిసి వచ్చింది. దీంతో ఎట్టకేలకు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలో రూ.1.07 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వెలగపూడిలో 'అమరావతి పునఃప్రారంభం' పేరుతో ప్రభుత్వం భారీ వేడుకను నిర్వహించనుంది. అమరావతిలో జరిగే కార్యక్రమానికి వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల కోసం 35 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు పెట్టారు. ప్రతి గ్యాలరీలో వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు వేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు పెట్టారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్యాలరీలో తాగునీరు, మజ్జిగ అందిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. భద్రత కోసం 6,500 మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం 37 మంది IPS అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ IPSలను కేటాయించారు.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
రాజధానితో పాటు 'నాగాయలంకలో రూ.1,460 కోట్లతో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు. ముద్దనూరు నుంచి హిందూపురం వరకు జాతీయ రహదారి-716ను రూ.1,020 కోట్లతో 57 కి.మీ. మేర నాలుగు వరుసలుగా విస్తరణ. ముద్దనూరు-బి.కొత్తపల్లి మధ్య ఈ పనులు జరుగుతాయి. ఇదే హైవేలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు రూ.809 కోట్లతో 34 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరణ. తెలంగాణలో కల్వకుర్తి నుంచి ఏపీలో నంద్యాల మీదుగా జమ్మలమడుగు వరకు ఉన్న ఎన్‌హెచ్-167కె లో నంద్యాల నుంచి కర్నూలు, కడప సరిహద్దు వరకు 62 కి.మీ. మేర రూ.692 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ. మైదుకూరు నుంచి సింగరాయకొండ వరకు ఉన్న ఎన్‌హెచ్-167బిలో ముదిరెడ్డిపల్లె నుంచి కడప, నెల్లూరు సరిహద్దు వరకు 36 కి.మీ. మేర రూ.279 కోట్లతో రెండు వరుసలుగా విస్తరణ. కోల్‌కతా-చెన్నై ఎన్‌హెచ్‌లో రణస్థలం పట్టణ పరిధిలో రూ.252 కోట్లతో 5 కి.మీ. మేర ఆరు వరుసలుగా విస్తరణ. హైదరాబాద్-బెంగళూరు హైవేలో శ్రీసత్యసాయి జిల్లాలోని ఎర్రమంచి, గుడిపల్లి గ్రామాల వద్ద రూ.124 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన' పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
మైదుకూరు-సింగరాయకొండ జాతీయ రహదారిలో సీఎస్ పురం నుంచి మాలకొండ వరకు రూ.277 కోట్లతో 44 కి.మీ. మేర పూర్తయిన రెండు వరుసల విస్తరణ. ఇదే హైవేలో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 46 కి.మీ. మేర రూ.370 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించిన ప్రాజెక్టు. సీతారామపురం నుంచి కావలి వరకు ఉన్న ఎన్‌హెచ్-167బిజిలో సీతారామపురం నుంచి దత్తులూరు వరకు 36 కి.మీ. రూ.364 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించింది. జమ్మలమడుగు-ప్రొద్దుటూరు మార్గంలో రైల్వే క్రాసింగ్ వద్ద రూ.68 కోట్లతో నిర్మించిన ఆర్వోబీ. పుంగనూరు పట్టణ పరిధిలో 10 కి.మీ. మేర రూ.41 కోట్లతో విస్తరించిన నేషనల్ హైవే. రేణిగుంట-నాయుడుపేట మధ్య రూ.2,510 కోట్లతో 57 కి.మీ. మేర ఆరు వరుసలతో విస్తరించిన జాతీయ రహదారి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు కనెక్టివిటీకి రూ.50 కోట్లతో 4 కి.మీ. మేర నాలుగు వరుసలుగా విస్తరించిన పనులు'కు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
ప్రధాన వేదికపై ప్రధాని మోదీతో సహా 19 మంది కూర్చుంటారు. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్రమంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సీఎస్ విజయానంద్ తదితర ముఖ్యులు ఉంటారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి గుర్తుగా ఒక పైలాన్‌ను నిర్మిస్తున్నారు. దీనిని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.
Also Read: కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడికెళ్లారంటే ?