Heavy Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌

దేశవ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో అది వాయుగుండగా మారే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.

New Update
Hyderabad Heavy Rains

Hyderabad Heavy Rains

దేశవ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లు తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో అది వాయుగుండగా మారే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ(IMD) హెచ్చరిక జారీ చేసింది. ఈ వాయుగుండం రేపటికీ (మంగళవారానికి) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అల్ప పీడనం ప్రభావం వల్ల ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 17 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు , విశాఖ, అనకాపల్లి,  జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్  జారీ చేశారు. అలాగే,  ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కోనసీమ,  మన్యం జిల్లాలకు అరెంజ్ అలర్ట్.  కర్నూల్, కడప, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని ఓడ రేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసి అందరినీ అలర్ట్‌ చేశారు.

Also Read :  అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. స్కూల్స్‌కి సెలవులు!

Heavy Floods In Telugu States

అలాగే తెలంగాణలోను  భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జనగామ, వికారాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో 24 గంటల్లో 30 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు తెలంగాణలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మేడ్చల్, శామీర్‌పేట్, మూడుచింతలపల్లిలో చెరువులు నిండుకుండల్లా మారాయి.  మేడ్చల్-గౌడవెల్లి రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వరదతో ఆరు గేట్లు ఎత్తివేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు భారీగా వరద ప్రవహిస్తోంది. భారీ వరద ప్రవాహంతో 24 గేట్లు ఎత్తివేశారు. 

ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఏజెన్సీ మండలాలైన వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయిలో ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతోంది. కుండపోత వర్షంతో రోడ్లపై వరద పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. వెంకటాపురం శివాలయం వీధిలో రోడ్లు జలమయమయ్యాయి. మంగపేటలో పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకులను అనుమతించడం లేదు.

భారీ వర్షాలతో మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని దాతర్ పల్లిలో కట్టు కాల్వ తెగిపోయింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి.  మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని వట్టూర్‌, కిష్టాపూర్‌, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, హల్దీ  తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జాతీయ రహదారిపై నీరు చేరడంతో పోలీసులు వాహనాల రాకపోకలకు దారి మళ్లించారు. ఎంపీడీవో, పోలీసు స్టేషన్లలకు వెళ్లే రహదారిపై ఉద్ధృతంగా వరద ప్రవహిస్తోంది. 

ఇది కూడా చూడండి:  రామంతపూర్ షాక్ ఘటనకు కారణం వాళ్లే.. ఘటనా స్థలంలో హైటెన్షన్!

Advertisment
తాజా కథనాలు