India vs Bharat Row - Dilip Ghosh: ఇండియా పేరును భారత్ గా మార్చాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. పేరు కచ్చితంగా మారుతుందని అధికార పార్టీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చునే చోట కూడా ఇండియాకు బదులు భారత్ అనే నేమ్ ప్లేట్ నే పెట్టారు. అలాగే సదస్సులో ఎక్కడా ఇండియా అనే పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీలయినంత ప్రతీ చోటా భారత్ పేరునే ప్రమోట్ చేసింది కూడా. కానీ అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విమర్శలు చేస్తున్నాయి.
ఇండియా పేరు భారత్ గా మార్చాల్సిందే...
దేశం పేరు మార్పు కాంట్రవర్శీ ముదురుతున్న తరుణంలో బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కీలకంగా మారుతున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేని వాళ్ళు హాయిగా దేశం వదిలి వెళ్ళిపోవచ్చని దిలీప్ అన్నారు. దేశానికి భారత్ అనే పేరే కరెక్ట్ అంటూ ఆయన సమర్ధించారు. ఖరగ్ పూర్ లో జరిగిన ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు. అంతేకాదు బెంగాల్ లో బీజెపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న విదేశీయుల విగ్రహాలను కూడా తొలగిస్తామని చెప్పారు. దిలీప్ ఘోష్ బీజెపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
Also Read: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు!
మరోవైపు బీజెపీ మరోనేత రాహుల్ సిన్హా కూడా ఇండియా పేరును భారత్ గా మార్చడాన్ని సమర్ధించారు. దేశానికి రెండు పేర్లు ఉండడం కంటే భారత్ అనే ఒకటే పేరు ఉండడమే సబబు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీ20 సదస్సులో భారత్ పేరును ప్రమోట్ చేడం ద్వారా గవర్నమెంట్ పేరు కచ్చితంగా మారుతుందనే సంకేతాలను ఇచ్చిందని తెలిపారు.
మండిపడుతున్న విపక్షాలు...
ఇక బీజేపీ నేతల వ్యాఖ్యల మీద తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దేశంలో బోలెడు సమస్యలుంటే వాటి పరిష్కరించకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మార్చడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: మరోసారి సోషల్ మీడియాలో ఫోటో .. ఉదయ్ ఏం చెప్పాలనుకున్నాడు!