Wanaparthy : ఆటలకు దూరం చేస్తున్నారని ఆ విద్యార్థులు పాఠశాల గోడదూకి ఏం చేశారంటే?

తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ ఆటలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ గురుకుల పాఠశాల విద్యార్థులు పెద్ద సాహసానికి సిద్ధపడ్డారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడదూకి పొలం గట్లవెంట పరుగులు పెట్టడం కలకలం రేపింది.

New Update
Chityal residential school students

Chityal residential school students

Wanaparthy : తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ ఆటలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ గురుకుల పాఠశాల విద్యార్థులు పెద్ద సాహసానికి సిద్ధపడ్డారు.వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడదూకి పొలం గట్లవెంట పరుగులు పెట్టడం కలకలం రేపింది. వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: అయ్యో.. మాంసం లేక ఆగిపోయిన వందలాది పెళ్లిళ్లు.. ఎక్కడో తెలుసా ?

వనపర్తి జిల్లా చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల పదవతరతి విద్యార్థులు ఆందోళనకు దిగడం చర్చనీయంశమైంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాలకు చెందిన సుమారు 80మంది విద్యార్థులు ఒక్కసారిగా గురుకుల పాఠశాల ప్రహారీ గోడను దూకారు. దూకడమే ఆలస్యం..పాఠశాలను అనుకోని ఉన్న పొలం గట్ల వెంట పరుగులు పెట్టారు.  చిట్యాలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు వారంతా పొలం గట్ల పరుగెత్తడం చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు. అయితే విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంటనే అప్రమత్తమై తోటి ఉపాధ్యాయులును అప్రమత్తం చేశారు. వెంటనే తేరుకున్న టీచర్లు అంతా విద్యార్థుల వెంట పరుగులు పెట్టారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు, స్థానిక యువకులు కూడా విద్యార్థుల వెంట పరుగందుకున్నారు. అందరూ కలసి విద్యార్థులను మార్గ మధ్యలోనే అడ్డు్కుని తిరిగి పాఠశాలకు తీసుకు వచ్చారు.

అయితే ఈ విషయం గ్రామస్తుల ద్వారా జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులను పాఠశాలకు వెళ్లి వారి సమస్యలు అడిగి పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆఘామేఘాల మీదా అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. వారి సమస్యలను అడిగి తక్షణమే పరిష్కరిస్తామని సూచించారు. అయితే పాఠశాలలోని విద్యార్థులు మాత్రం ససేమిరా అన్నారు.  తమ సమస్యలను అడిగితే చెప్పడానికి నిరాకరించారు. జిల్లా కలెక్టర్ వస్తేనే తమ సమస్యలను వెల్లడిస్తామని తేల్చిచెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాలకు రాక తప్పలేదు.

పాఠశాలకు చేరుకున్న కలెక్టర్‌ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువు ఒత్తిడితో తమను ఆటల నుంచి దూరం చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసి తమను వారితో తిట్టిస్తున్నారని, లేనిపోని అభాండాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఉపాధ్యాయులు ఇష్టరీతిన తమను దుర్భాషలాడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ ఆదర్శ్ సురభి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిపి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అందించాల్సిన వసతులను క్రమం తప్పకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్గదర్శనం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సమస్య ఏదైన ఉంటే పాఠశాలలోనే పరిష్కారించుకోవాలని ఇలా రోడ్ల పైకి చేరే వరకు అజాగ్రత్త వహించడం సరైనది కాదని జిల్లా కలెక్టర్  ఉపాధ్యాయులను మందలించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లా ఆర్ సి ఓ శ్రీనివాస్ గౌడ్, DCO శ్రీవేణిలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సమస్యలను తనకు నేరుగా వివరించడానికి వీలుగా  ఫిర్యాదుల బాక్సును పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేసి వారిలో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. కాగా విద్యార్థులు గ్రామంలోని పొలాల వెంట పరుగెత్తడం, వారిని పట్టుకునేందుకు గ్రామస్తులు పరుగెత్తడంతో గ్రామంలో అలజడి చెలరేగింది. కొంత సేపు అసలేం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : రూ.4 లక్షలు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషన్.. ACBకి అడ్డంగా దొరికిన మహిళా ఆఫీసర్!

Advertisment
తాజా కథనాలు