Crime News: చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్‌..టీడీపీ నేతలకు టోకరా

ఏఐ వచ్చాక ఏది నిజమో..ఏది  కృత్రిమమో తెలియని పరిస్థితి నెలకొంది.  దీంతో పలువురు మోస పోతున్నారు. అలాంటిదే ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్‌ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన విషయం కలకలం రేపింది.

New Update
Video calls like Chandrababu with AI

Video calls like Chandrababu with AI

Crime News : ఏఐ వచ్చాక ఏది నిజమో..ఏది  కృత్రిమమో తెలియని పరిస్థితి నెలకొంది.  దీంతో పలువురు మోస పోతున్నారు. అలాంటిదే ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో వీడియో కాల్స్‌ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన విషయం కలకలం రేపింది. ఏఐని( కృత్రిమ మేధ)ను ఉపయోగించి... ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్‌ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తుతెలియని వ్యక్తి మోసం చేశాడు. గత నెల 30వ తేదిన ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొంతమంది టీడీపీ  నాయకులకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను దేవినేని ఉమా పీఏనని పరిచయం చేసుకున్న అతను, సార్‌ వీడియో కాల్‌ చేస్తారని చెప్పి పెట్టేశాడు. అతను చెప్పినట్లే కొంతసమయానికి ఉమాలా వీడియో కాల్‌ చేశాడు.

తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని , దానికి గాను మూడు ఫోన్‌ నంబర్లు ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ నెంబర్లుకు ఫోన్‌పేలో నగదు పంపాలని సూచించాడు. సదరు టీడీపీ నేతలు అది నిజమేనని నమ్మి రూ.35 వేలు పంపారు.  మరోసారి ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్‌ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గాను బీఫామ్‌ ఇప్పిస్తానని నమ్మించాడు. మీతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే వీడియోకాల్‌లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు పేర్లు సేకరించాలని చెప్పాడు. తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి.. అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్‌లు ఇప్పిస్తాననని నమ్మబడికాడు.

అంతేకాక విజయవాడ వచ్చి ఓ హోటల్‌లో దిగమని సలహా కూడా ఇచ్చాడు.  ఆ తర్వాత ఆ హోటల్‌ వారికి కూడా ఫోన్‌ చేసి తమ నాయకులు వస్తున్నారనీ, వారికి బస ఏర్పాటు చేయాలని వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. వారు కూడా నిజమేనని నమ్మారు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వెళ్లి ఆ హోటల్‌లో దిగారు. బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్‌ చేశాడు. సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లడానికి కేవలం 8మందికే అనుమతి ఉందనీ, ఆయన వద్దకు వెళ్లాలంటే ఒక్కొక్కరు రూ.10 వేలు ఇవ్వాలని చెప్పాడు. దానితో వారికి అనుమానం వచ్చింది.

ఈలోగా హోటల్‌ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో వారు సిబ్బందితో గొడవపడ్డారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమాకు కాల్‌ చేశారు. అయితే వెంటనే స్పందించి తాను ఎవరికీ వీడియోకాల్‌ చేయలేదనీ, ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్‌ అనే వ్యక్తి  ఇలా అందరికీ కాల్స్ చేసి  మోసం చేస్తున్నట్లు తన దృష్టికి  వచ్చిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. అసలు విషయం తెలిసిన ఖమ్మం జిల్లా నాయకులు ఖంగు తిన్నారు. ఇక ఈ విషయమై ఫిర్యాదు ఇస్తే పరువు పోతుందని చెప్పి నాయకులు ఇంటి దారి పట్టినట్లు తెలిసింది.

Also Read :  హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్

Advertisment
తాజా కథనాలు