/rtv/media/media_files/2025/08/23/go-back-marwadi-controversy-in-telangana-2025-08-23-17-56-14.jpg)
Go Back Marwadi controversy in Telangana
తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్(go back marwadi from telangana) ఉద్యమం మరింత రాజుకుంటోంది. హైదరాబాద్(Hyderabad Marwadies Issue) తో పాటు జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. మార్వాడీ హఠావో..తెలంగాణ బచావో పేరిట మరో ఉద్యమం నిర్మాణమవుతోంది. ఇది తెలంగాణ ఉద్యమం 2.0 అంటున్నారు ఉద్యమకారులు. మీరొచ్చి మా కడుపు కొడుతున్నారు.. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వర్తకులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా ఏపీకి కూడా పాకింది. ఈ వివాదం రోజు రోజుకూ మరింత ముదురుతోంది. మెల్లమెల్లగా ఉద్యమ రూపం దాల్చుతోంది.
మార్వాడీలు(marwadies) గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను విక్రయిస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. -హవాలా మనీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్వాడీలు మారుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. పాతబస్తీలో చాలా చోట్ల మార్వాడీలు హవాలా బిజినెస్ చేస్తున్నారని ఉద్యమకారులు అంటున్నారు. అనేక వ్యాపారాలపై మార్వాడీలు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారంటున్నారు. మార్వాడీల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. తమ వృత్తులకు మార్వాడీలు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ LB నగర్‌లో స్వర్ణకారులు భిక్షాటన చేశారు.
Also Read : కూకట్‌పల్లి వైపు వెళ్తున్నారా? కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
Go Back Marwadi Controversy In Telangana
అసలేం జరగిన విషయానికొస్తే.. జులై 31న సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో బైక్ మీద వెళుతున్న తెలంగాణ కు చెందిన సాయి రోడ్డుకు అడ్డంగా పెట్టిన కారు తీయాలంటూ హారన్ కొట్టాడు. సదరు వాహనం ఎస్ కే జువెలరీ షాపు వారికి చెందింది. ఈ విషయంలో ఆ షాపు యజమాని అల్లుడు అభిషేక్ సాయితో గొడవ పడటమే కాదు.. అతడిపై దాడికి పాల్పడి గాయపర్చాడు. ఈ గొడవ అనేక మలుపులు తిరిగి తర్వాత ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే వరకు వచ్చింది. హైదరాబాద్ తో మొదలైన ఈ రచ్చ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అంతకంతకూ ముదురుతోంది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ అయితే ఆగస్టు 22 మార్వాడీ గో బ్యాక్ అంటూ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.
ఓయూ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంద్ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.. కొందరు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గుజరాతి గో బ్యాక్ రాజస్థాన్ అంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని ఓయూ హాస్టల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వివాదం ముదరడంతో సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో సాయిపై దాడి ఆ తర్వాత పరిణామాలపై అక్కడి మార్వాడీలు, సాయి మీడియా సమావేశం నిర్వహించారు. తనపై జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని సాయి స్పష్టం చేశాడు. కేవలం తనకు, SK జువెల్లర్స్ కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు.
మరోవైపు తెలంగాణ(Telangana) లోని రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోనూ మార్వాడీలు, అక్కడి వ్యాపారస్తులకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో అక్కడి వ్యాపారస్తులు ‘గోబ్యాక్ మార్వాడీ’ అంటూ ఆందోళనకు దిగారు. అయితే ఆమన్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చిన వ్యాపారులు ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. కానీ, ఈ ఉద్యమం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరుగా వ్యాపిస్తోంది. ‘‘మీరొచ్చి మా కడుపు కొడుతున్నారు.. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు’’ అని మార్వాడీల ఉనికిని ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో లోకల్ వర్తక సమాజం. కానీ, గుజరాత్ మా జన్మభూమి, తెలంగాణ మా కర్మభూమి.. ఇక్కడే పుట్టాం..ఇక్కడే పెరిగాం.. తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. మేమూ మీ వాళ్లమే అంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వేలామంది కార్మికులు పనికోసం ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. వాళ్లతో లేని వివాదం తమతో మాత్రమే ఎందుకు అని మార్వాడీలు నిలదీస్తున్నారు. తాము తెలంగాణ ఉద్యమంలోనూ భాగస్వాములమయ్యామని వెల్లడిస్తున్నారు.
అటు ఏపీ(AP) లో కూడా గోబ్యాక్ మార్వాడీ స్లోగన్ ఊపందుకుంది. మార్వాడీలను తరిమికొడుతామని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. ఇటు తెలంగాణ లోని హైదరాబాద్ లో మార్వాడీ హఠావో.. తెలంగాణ బచావో అంటూ వైశ్య వికాస వేదిక నాయకులు గళమెత్తారు. ఎల్బీనగర్‌లో 3 కిలోమీటర్ల మేర భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజస్థాన్, గుజరాత్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ మార్వాడీ గోబ్యాక్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో గోబ్యాక్ రోహింగ్యాలు అంటు కొత్త రాగం ఎత్తుకొంది. దీనికోసం పాదయాత్రలు చేస్తామని కొంతమంది ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉద్యమం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చూడండి:కేసీఆర్ స్వల్ప అస్వస్థత ? చికిత్స అనంతరం..