TG Local Elections: ఎలక్షన్స్ ఆపేదేలేదు.. పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ ప్లాన్-బీ ఏంటో తెలుసా?

స్థానిక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్ సర్కార్ ప్లాన్-బీ కూడా రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. BC రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన GOను కోర్టు కొట్టేస్తే.. పాత రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

New Update
Telangana Local Elections

తెలంగాణలో స్థానిక ఎన్నికలు(telangana-local-body-elections) జరుగుతాయా? జరగవా? అన్న అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మరో వైపు ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల విచారణ పెండింగ్ లో ఉంది. ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8న హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. దీంతో న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న అంశంపై ఆశావహులతో పాటు ప్రధాన పార్టీల్లో ఆందోళన నెలకొంది. 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రచారం ప్రారంభించి ముందుకు వెళ్లాలా? లేక న్యాయస్థానం నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలా? అన్న చర్చ వారిలో సాగుతోంది. 

ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్లాన్-బీని సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఆగకుండా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేస్తే వెంటనే పాత రిజర్వేషన్ల ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గత ప్రభుత్వం బీసీలకు 23 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కోర్టు కొట్టివేస్తే వెంటనే అధికారులు పాత పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ముందుకు వెళ్లనున్నారు. 

అంటే.. బీసీలకు 43 శాతానికి పెంచిన రిజర్వేషన్లను తగ్గిస్తూ మార్పులు తేనున్నారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, జనరల్ కు రిజర్వ్ అయిన స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉండదని చెబుతున్నారు. కేవలం బీసీ రిజర్వ్ అయిన స్థానాలే ఇప్పుడు జనరల్ కు మారుతాయని చెబుతున్నారు. అందులో కూడా మహిళా రిజర్వేషన్లు మారవని అంటున్నారు. దీంతో ఎవరైనా రిజర్వ్ అయిన స్థానం నుంచి బీసీ అభ్యర్థి పోటీకి సిద్ధం అయితే.. రేపు ఒక వేళ రిజర్వేషన్లు మారినా ఎలాగూ జనరల్ అవుతుంది కాబట్టి పోటీ చేసే అవకాశం ఉంటుందని గమనించాలని చెబుతున్నారు. 

Also Read :  నగర ప్రయాణీకులకు బిగ్‌ షాక్‌...బస్సు చార్జీల పెంపు

కాంగ్రెస్ ఆలోచన అదే?

ఒక వేళ బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టులు అంగీకరించకపోతే పార్టీ పరంగా అవకాశం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఇతర పార్టీలు కూడా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేయనుంది. తద్వారా బీసీల రిజర్వేషన్ పెంపుకు తాము కట్టుబడి ఉన్నామని చాటాలన్నది ఆ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది. 

Also Read :  ప్రేమ పేరుతో కానిస్టేబుల్‌ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి

నెల రోజులు ఆగుతారా?

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి పెంచడం కోసం ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ ఆమోదించిగా.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ బిల్లుపై గవర్నర్ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ అంశాన్ని ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుకు జీవో ఎలా తీసుకువస్తారని అడిగింది. అయితే.. గవర్నర్లు తమ వద్దకు రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన బిల్లులపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

ఒక వేళ వారు ఈ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంచాయతీ రాజ్ బిల్లును పంపి ఇప్పటికే 65 రోజులు అయ్యింది. మరో 25 రోజులు అయితే సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తి అవుతుంది. అప్పటిలోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే చట్టం డీఫాల్ట్ గా అమల్లోకి వస్తుందని.. అప్పుడు ఎన్నికలకు వెళ్లడం సులభం అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు జీవోను కొట్టేస్తే ఆ ఆప్షన్ ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు