TGSRTC: టీజీఎస్ ఆర్టీసీకి షాక్.. 10 రూపాయలకు పది వేల ఫైన్

తెలంగాణ ఆర్టీసీకి వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఒకే దూరానికి ఒకే రకమైన బస్సుల్లో వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుడి నుంచి రూ.10 అదనంగా వసూలు చేసినందుకు ఏకంగా రూ.10 వేలు ఫైన్ వేసింది.

New Update
TGSRTC ticket

TGSRTC ticket

TGSRTC: టీజీఎస్‌ ఆర్టీసీకి వినియోగదారుల కమిషన్ షాక్‌ ఇచ్చింది. ఒకే దూరానికి వేర్వేరు బస్సుల్లో వేర్వేరు టికెట్ ఛార్జీలు వసూలు చేస్తుండటంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖమ్మం డిపో పరిధిలో జరిగిన ఈ వ్యవహారంలో సరూర్‌నగర్‌కు చెందిన నింగేష్ ఉషప్ప అనే న్యాయవాది బాధితుడిగా ఉన్నాడు. 2023 జూలై 15న ఎల్బీనగర్ నుంచి సూర్యాపేటకు వెళ్లేందుకు ఉషప్ప ఒక ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించారు. సూర్యాపేట డిపోకి చెందిన ఆ బస్సులో రూ.180 చెల్లించి టికెట్ తీసుకున్నారు. 

అధికంగా వసూలు..

అదే రోజున తిరుగు ప్రయాణంలో ఖమ్మం డిపో బస్సులో ఎల్బీనగర్‌కు తిరిగి రావడానికి టికెట్ తీసుకున్నపుడు మాత్రం రూ.190 వసూలు చేశారు. అంటే ఒకే దూరానికి.. అదే రూట్‌కి పది రూపాయలు అధికంగా వసూలు చేశారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఉషప్ప డ్రైవర్‌ను ప్రశ్నిస్తే అతను స్పందించలేదు. దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఇచ్చిన వాదనలో ఖమ్మం డిపో బస్సులో ఎల్బీనగర్‌ స్టేజీ వివరాలు నమోదు చేయకపోవడంతో ఎంజీబీఎస్ వరకూ ఛార్జీగా రూ.190 వసూలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: రోజూ ద్రాక్ష పండ్లు తింటే ఎండలో తిరిగినా ఏమీ కాదా?

కానీ ఫిర్యాదుదారు అందించిన టికెట్ ఆధారంగా కమిషన్‌కు స్పష్టంగా తెలిసింది. టికెట్ ఎల్బీనగర్ వరకే ఇచ్చారని, అయినా అదనంగా వసూలు చేశారని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు, సభ్యులు ఆర్టీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుడి నుంచి అదనంగా వసూలు చేసిన రూ.10ను తిరిగి ఇవ్వడంతో పాటు పరిహారంగా రూ.5 వేలు, కేసు ఖర్చులుగా మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.10,010ను 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రయాణికుల్లో చైతన్యం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణంలో అన్యాయంగా ఛార్జీలు వసూలు చేస్తే వినియోగదారులు తమ హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడే అవకాశం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.


ఇది కూడా చదవండి: రోజూ మనకు తెలియకుండానే ఈ విషాహారం తీసుకుంటున్నాం

( tgsrtc-bus | latest-news | crime news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు