/rtv/media/media_files/2025/10/29/rain-tips-2025-10-29-12-23-28.jpg)
Rain Tips
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్స సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, బలమైన గాలులతో కూడిన తుపాను విరుచుకుపడిన నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, భద్రతను కాపాడుకోవడానికి అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తుపానుకు ముందు, తుపాను సమయంలో, తుపాను తర్వాత తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలను అధికారులు తెలియజేస్తున్నారు. తుపాను తీరం దాటుతున్న సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండటం ఉత్తమమని చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. కిటికీలు, తలుపులకు దూరంగా, భవనంలో అత్యంత సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవాలని అంటున్నారు. అధికారిక హెచ్చరికలు, సమాచారం కోసం మాత్రమే రేడియో, టీవీ ద్వారా వార్తలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆరోగ్య, భద్రతా జాగ్రత్తలు..
అంతేకాకుండా.. తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తుపాను కారణంగా నీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున.. కాచి చల్లార్చిన లేదా క్లోరినేటెడ్ నీటిని మాత్రమే తాగాలని అంటున్నారు. విద్యుత్ జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. విద్యుత్ షాక్‌లను నివారించడానికి.. మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసి అన్ని ఎలక్ట్రిక్ ఉపకరణాల ప్లగ్‌లను తీసివేయాలి. తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలు లేదా తడిసిన విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి. ప్రమాదాల నివారణకు గ్యాస్ స్టవ్ పైపులు, వాల్వ్‌లను మూసివేయాలి. ప్రతి కుటుంబం ప్రథమ చికిత్స కిట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో అవసరమైన మందులు, కట్టుగుడ్డలు, యాంటీసెప్టిక్ ద్రవం వంటి ప్రథమ చికిత్స వస్తువులు.. టార్చ్‌లైట్, అదనపు బ్యాటరీలు, నిల్వ ఉండే ఆహారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. తుపాను తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారో తెలుసా..?
ముఖ్యంగా వరద నీటికి దూరంగా ఉండాలి. వరద నీటిలో కలుషితాలు, రసాయనాలు, పాములు, తేళ్లు, తెగిపడిన వైర్లు ఉండవచ్చు. ఎట్టిపరిస్థితిలోనూ వరద నీటిలో నడవవద్దని అధికారులు చెబుతున్నారు. తడిసిన తర్వాత శరీరం పొడిగా ఉండేలా వెంటనే తడి బట్టలు మార్చుకోవాలి. చర్మం మడతలను పొడిగా ఉంచుకోవడం వల్ల దద్దుర్లు రాకుండా ఉంటాయి. ఇంకా భోజనానికి ముందు, టాయిలెట్ వాడిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులు వాడాలని చెబుతున్నారు. కరెంట్ లేకపోవడం వల్ల పాడైపోయిన ఆహారాన్ని తినవద్దని చెబుతున్నారు. ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే విద్యుత్, గ్యాస్‌ను ఆన్ చేయాలి. ఇంట్లో జనరేటర్‌ను నడపడం కార్బన్ మోనాక్సైడ్ విషానికి దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి. చిన్న గాయాలైనా అంటువ్యాధిగా మారకుండా వెంటనే శుభ్రం చేసి చికిత్స అందించాలి. ప్రభుత్వం మీ ప్రాంతాన్ని సురక్షితమని అధికారికంగా ప్రకటించే వరకు పునరావాస కేంద్రాలలో లేదా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..ఐఎండీ తాజా హెచ్చరిక
Follow Us