/rtv/media/media_files/2025/08/15/illegalsurrogacy-and-egg-trading-2025-08-15-15-52-34.jpg)
Illegal surrogacy and egg trading
Surrogacy : సరోగసీ పేరుతో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం డాక్టర్ నమ్రత అక్రమ మానవ రవాణాకు పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రా్ల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఫర్టిలిటీ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాల గుట్టు రట్టు చేసింది. మాదాపూర్‌లోని రెండు ఆస్పత్రుల్లో అక్రమంగా సరోగసి, ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్రమ సరోగసీ, ఎగ్ డొనేట్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు.
సృష్టి కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలను పర్యవేక్షించడానికి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలో 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించి, నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నర్రెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బు అవసరం ఉన్న పేద, మధ్యతరగతి మహిళలను ఎంచుకున్న తల్లీ కొడుకులు ఎగ్ డోనర్, సరోగసి మదర్‌గా ఒప్పందాలు చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధరించారు. లక్ష్మి రెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్నట్లు తేలింది. వీరు సులభంగా డబ్బులు సంపాదించాలని అక్రమ సరోగసి విధానానికి తెరలేపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని డీసీపీ తెలిపారు.
వారిచ్చిన సమాచారంతో అక్రమ సరోగసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్లను అరెస్ట్ చేశారు. అందులో ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారని డీసీపీ తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకుని వారికి సరోగసి పేరుతో మాయమాటలు చెప్పి వారినుంచి 15- 20 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా పట్టుబడ్డ లక్ష్మీ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి JNTU లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడని, అయితే అక్రమ సంపాదనకు అలవాటు పడి అమ్మకి తోడుగా ఈ వ్యాపారంలోకి దిగాడని డీసీపీ తెలిపారు. వీరు డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్ గా చేసుకుని వారికి నగదు చెల్లించి ఎగ్ డొనేట్ చేయించడంతోపాటు, సరోగసికి ఒప్పిస్తున్నారని తేలింది. అరెస్ట్ చేసిన నిందితుల దగ్గర 6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిద్దరూ కొన్ని హాస్పిటల్స్ కు ఏజెంట్లుగా కూడా పనిచేస్తున్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. కాగా వీరిపై సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశామని వివరించారు.